రోకలిబండతో భర్తను చంపేసిన భార్య | Husband Killed By Wife In Guntur District | Sakshi
Sakshi News home page

రోకలిబండతో భర్తను హతమార్చిన భార్య

Sep 30 2019 6:23 AM | Updated on Sep 30 2019 12:32 PM

Husband Killed By Wife In Guntur District - Sakshi

వివరాలు సేకరిస్తున్న సీఐ అంకమ్మరావు

సాక్షి, తాడేపల్లి: భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన భార్య అతికిరాతకంగా రోకలిబండతో మోది హతమార్చిన సంఘటన మండలంలోని పెనమాకలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. పెనమాక ఎస్సీకాలనీలో నివాసం ఉండే కుంచం రత్నకుమార్‌కు విజయవాడకు చెందిన సునీతతో 14 ఏళ్ళ క్రితం వివాహమైంది. రత్నకుమార్‌ పెయింటర్‌ పనులు చేస్తుంటాడు. వీరికి ఇద్దరు సంతానం. రత్నకుమార్‌ సమీప బంధువైన విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన ఓ మహిళ వస్తూ పోతూ ఉండేది. ఈమె విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో పని చేస్తుంది. కొంతకాలంగా భర్తతో ఆమెకు విభేదాలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం రత్నకుమార్‌ ఆ మహిళ వద్దకు వెళ్లాడు. ఆదివారం ఆమెను వెంట పెట్టుకుని పెనమాక చేరుకున్నాడు. ఈ విషయంపై రత్నకుమార్‌ దంపతుల మధ్య కొట్లాట జరిగింది. అనంతరం రత్నకుమార్‌ కుమారుడు, కుమార్తెతో ఇంటిలోని ఒక గదిలో పడుకున్నారు. కొద్దిసేపటికి కుమారుడు తమ ఇంటికి దగ్గరలో ఉన్న మేనత్త ఇంటికి బయలుదేరాడు. సునీత పిలిచి ‘ఇక్కడ ఏమి జరిగినా ఎవరికీ చెప్పొద్దు. నేను నీ దగ్గరకు వస్తాను’ కొడుక్కి చెప్పింది. అనంతరం కుమార్తె పక్కన ఉండగానే రోకలిబండతో రత్నకుమార్‌ (33)ను తలపై విచక్షణారహితంగా మోదింది. తల నుజ్జునుజ్జవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చేతికి, ఒంటిపై ఉన్న రక్తపు మరకలు కడుక్కొని హత్యకు ఉపయోగించిన రోకలిబండను దాచిన సునీత.. రత్నకుమార్‌ చెల్లి ఇంటికి వెళ్లి కొడుక్కి విషయం చెప్పింది. అక్కడ నుంచి తాడేపల్లి పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. కొడుకు, కూతురు నాన్న దగ్గరకు వెళదామని ఏడ్చినా వినకుండా స్టేషన్‌కు తీసుకెళ్లింది.  తాడేపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement