వడదెబ్బకు పదిమంది మృత్యువాత

Ten Members Died With Summer Heat - Sakshi

జిల్లాలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఈ క్రమంలో వడదెబ్బ మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గురువారం రాత్రి, శుక్రవారం పదిమంది మృత్యువాత పడ్డారు.వివరాలిలా ఉన్నాయి.

పొదలకూరు: మండలంలోని ఆల్తుర్తి గ్రామానికి చెందిన షేక్‌ ఇమామ్‌సాహేబ్‌ (72) వడదెబ్బకు గురై మృతిచెందాడు. ఎండల వేడికి తీవ్ర అనారోగ్యానికి గురైన ఇమామ్‌సాహేబ్‌ను పొదలకూరు ఆస్పత్రికి తరలించేలోగానే తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఇంకా పద్మావతి నగర్‌కు చెందిన మద్దిరెళ్ల నర్సమ్మ (65) వడదెబ్బకు గురై గురువారం రాత్రి మృతిచెందినట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు.
దగదర్తి: మండలంలోని కట్టుబడిపాళెం గ్రామానికి చెందిన వృద్ధుడు వేముల రాగయ్య (80) వడదెబ్బతో మృతిచెందినట్టుగా కుటుంబ సభ్యులు తెలియజేశారు.

గూడూరు పట్టణంలోని అశోక్‌నగర్‌లో నివాసం ఉంటున్న పాముల ఆదిలక్ష్మి (73) అనే వృద్ధురాలు వడదెబ్బకు గురై గురువారం రాత్రి మృతిచెందినట్టుగా కుటుంబ సభ్యులు శుక్రవారం తెలిపారు. ఆమె ఇంట్లో ఉన్న సమయంలో వేసవి తాపానికి గురై సొమ్మసిల్లి పడిపోయిందని, అనంతరం మృతిచెందినట్టు వారు తెలియజేశారు.

తడ: వడదెబ్బకు గురైన మండల కేంద్రమైన తడ బీసీకాలనీకి చెందిన కె.రామయ్య (65) గురువారం అర్ధరాత్రి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించాడు. అదేవిధంగా తడకండ్రిగ హైస్కూల్‌ రోడ్డులో నివసిస్తున్న ఎన్‌.బుజ్జయ్య (67) ఎండ వేడిమికి తాళలేక గురువారం అనారోగ్యానికి గురవడంతో కుటుంబ సభ్యులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న బుజ్జయ్య శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడని వారు తెలిపారు.

వింజమూరు: స్థానిక కొత్తూరుకు చెందిన తిప్పిరెడ్డి సుజాత వడదెబ్బకు మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. వారంరోజులుగా కాస్తున్న ఎండకు తాళలేక ఆమె వడదెబ్బకు గురైంది. శుక్రవారం ఆరోగ్యం విషమించి మృతిచెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులున్నారు.

సీతారామపురం: మండల కేంద్రమైన సీతారామపురంలోని ఎస్‌కే జులేఖాబీ (58) అనారోగ్యానికి గురై మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. జులేఖాబీ బజారుకు వెళ్లి ఇంటికి సరుకులు తీసుకువస్తుండగా ఎండ తీవ్రతను తట్టుకోలేక అక్కడికక్కడే కుప్పకూలినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితురాలిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మరణించినట్లు తెలియజేశారు.

వెంకటగిరిరూరల్‌:  వెంకటగిరి మండలం యాతలూరు గ్రామానికి చెందిన వైఎస్సాసీపీ నాయకుడు దంపెళ్ల రామకృష్ణ తండ్రి, మాజీ సర్పంచ్‌ దంపెళ్ల చిన అంకయ్య (70) ఎండలు అధికంగా ఉండడంతో అనారోగ్యానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంకటగిరిలో చికిత్స కూడా చేయించారు. అయితే పరిస్థితి విషయమించి శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు వారు తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని పెరియవరంలో సుబ్రహ్మణ్యంనాయుడు ఎండ కారణంగా అనారోగ్యానికి గురయ్యాడు. ఈక్రమంలో గురువారం రాత్రి మృత్యువాత పడినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top