రబీ సీజన్ ప్రారంభంలోనే విద్యుత్ అధికారులు చేతులెత్తేస్తున్నారు. పంటల సమయంలో విద్యుత్ అందించలేమని రైతులకు ముందే హెచ్చరిక పంపినట్లు కోతల షెడ్యూల్‌ను విడుదల చేశారు.
మంకమ్మతోట/రాయికల్, న్యూస్‌లైన్ : రబీ సీజన్ ప్రారంభంలోనే విద్యుత్ అధికారులు చేతులెత్తేస్తున్నారు. పంటల సమయంలో విద్యుత్ అందించలేమని రైతులకు ముందే హెచ్చరిక పంపినట్లు కోతల షెడ్యూల్‌ను విడుదల చేశారు. నారు దశలోనే ఇలా ఉంటే ఇక ముందు ముందు ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు విద్యుత్ కోతలు అమలవుతుండగా పెరిగిన కోతల వేళలు గురువారం నుంచే అమలు చేయాలని ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు.
పట్టణాలు, మండలకేంద్రాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కోతలు భారీగా పెరగనున్నాయి. గ్రామీణప్రాంతాల్లో త్రీఫేస్ సరఫరా ఉన్నప్పుడు మినహాయించి ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు దాకా విద్యుత్ ఉండదు. ఇప్పటిదాకా త్రీఫేస్ సరఫరా పగలు 5 గంటలు, రాత్రి 2 గంటలు అందిస్తుండగా, పగలు ఇస్తున్న విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలే కలుగుతున్నాయి. పగటిపూట సరాసరి నిత్యం 3 గంటలు కూడా విద్యుత్ సరఫరా కావడం లేదు. ఇప్పుడు ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలతో ఈ కోతలు మరింత పెరిగే అవకాశముంది. అలాగే సాధారణ ప్రజానీకానికి సైతం వేసవిలో ఇక్కట్లు తప్పేలా లేవు. తాజా ఆదేశాల్లో నగరాల్లో అధికారికంగా ఎలాంటి కోతలు లేనప్పటికీ అక్కడా విద్యుత్ కోత విధించే అవకాశాలున్నాయని సమాచారం.