
చట్టాలే చాలవు.. సంస్కారం నేర్పాలి
నిన్న ఢిల్లీలో నిర్భయపై లైంగిక దాడి ఘటన... ఇప్పుడు ముంబైలో మహిళా ఫొటో జర్నలిస్టుపై అత్యాచారం!
సాక్షి, హైదరాబాద్: నిన్న ఢిల్లీలో నిర్భయపై లైంగిక దాడి ఘటన... ఇప్పుడు ముంబైలో మహిళా ఫొటో జర్నలిస్టుపై అత్యాచారం! ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కొత్త చట్టాలు తెస్తే సరిపోతుందని కొందరు భావిస్తున్నా అది సరికాదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి అభిప్రాయపడ్డారు. యువతలో సంస్కారం అలవడేలా చూసినపుడే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయన్నారు. సమాచార భారతి, స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవ కమిటీ సంయుక్తంగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘వివేకానంద కలల భారతం- మీడియా బాధ్యత’ అనే అంశంపై జరిగిన సెమినార్‌లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఢిల్లీ ఘటన అనంతరం ప్రజల నుంచి తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం కావటంతో నిర్భయ చట్టం తెచ్చారని, తాజాగా ముంబైలో అదే తరహాలో మహిళా ఫొటోగ్రాఫర్‌పై అత్యాచారం చోటుచేసుకున్నందున మరే చట్టం తేవాలని ప్రశ్నించారు. యువతకు నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ సీవీ రాములు, ప్రముఖ జర్నలిస్టు , ఎంపీ చందన్‌మిత్రా, ఆంధ్రభూమి ఎడిటర్ ఎంవీఆర్‌శాస్త్రి, ప్రముఖ పాత్రికేయులు ఎస్‌ఆర్ రామానుజన్, వల్లీశ్వర్, వివేకానంద రాక్ మెమోరియల్ వైస్ ప్రెసిడెంట్ నివేదిత, సమాచార భారతి అధ్యక్షులు టి హరిహరశర్మ పాల్గొని మాట్లాడారు. సాక్షి టెలివిజన్ చీఫ్ సబ్ ఎడిటర్ ఏవీ నారాయణ, పల్లె రవికుమార్, కప్పర ప్రసాదరావుతో సహా 8 మంది జర్నలిస్టులు స్వామి వివేకానంద బోధనలపై ఈ సందర్భంగా అధ్యయన పత్రాలను సమర్పించారు.