
మాట్లాడుతున్న అర్చక సమాఖ్య జిల్లా అధ్యక్షులు అంజన్ కుమారాచార్యులు
అనంతపురం కల్చరల్ : ‘తొమ్మిది నెలలవుతోంది.. ఇంత వరకు జీతాలు ఇవ్వలేదు. ఎలా బతకాలి మేడమ్’ అంటూ దేవదాయ శాఖ సహాయ కమిషనర్ వాణి ఎదుట అర్చకులు వాపోయారు. అనంతపురంలోని మొదటిరోడ్డు కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ఉదయం అర్చక పురోహిత గ్రీవెన్స్‌ను, మధ్యాహ్నం కో ఆర్డినేటర్ల సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల నుంచి వచ్చిన అర్చకులు తమ సమస్యలను ఈ సందర్భంగా దేవదాయ శాఖ ఏసీకు వివరించారు. తొమ్మిది నెలలుగా జీతాలు అందకపోవడం జీవనం దుర్భరంగా మారిందని విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామం అభయాంజనేయస్వామి ఆలయ అర్చకుడు మురళీస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 30 ఎకరాల ఆలయ భూములను రెవెన్యూ శాఖ ప్లాట్లు వేసి ప్రజలకిచ్చారని, ఒప్పందం మేరకు ప్రతినెలా వడ్డీ ఆలయానికి అందక పోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారన్నారు. అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగడం లేదని వాపోయారు. పుట్లూరు మండలంలో ఆలయంలో హుండీ నిర్వహణకు గ్రామ పెద్దలు అడ్డుపడుతున్నారని న్యాయం చేయాలని విన్నవించుకున్నారు.
అనంతరం జరిగిన సమావేశంలో అర్చక సమాఖ్య జిల్లా అధ్యక్షులు అంజన్‌కుమారాచార్యులు, ఉపాధ్యక్షులు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి పూజారి భీమప్ప మాట్లాడుతూ జిల్లా అర్చక సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కోరారు. ఆలయ భూములను 13వ కాలమానంలోకి ఎక్కిస్తే ఇన్‌పుట్ సబ్సిడీ, విత్తన పంపిణీ, క్రాప్ డ్యామేజ్ లాంటివి వర్తిస్తాయన్నారు. అర్చక సమాఖ్య కోశాధికారి రాములు, ఈసీ మెంబర్లు నరసింహులు, పుల్లమాచార్యులు పాల్గొన్నారు.
కో ఆర్డినేటర్ల నియామకం
జిల్లా ఏఆర్‌సీటీ (అర్చక రిలీజియన్ చారిటబుల్ ట్రస్టు) జిల్లా కోర్డినేటర్‌గా రవిచంద్ర శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు నియామక పత్రాన్ని ఆ సంఘం అధ్యక్షుడు అంజనకుమారాచార్యులు అందించారు. వజ్రకరూరుకు రాజేంద్రప్రసాదశర్మ, తాడిపత్రికి రంగనాథశర్మ, అమరాపురానికి శ్రీనాథభట్టును మండల కో ఆర్డినేటర్లుగా నియమించారు.