
సాక్షి, శ్రీకాకుళం : కాకరపల్లి థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేసి, తమకు న్యాయం జరిగేల చూడాలంటూ కాకరపల్లి థర్మల్ విద్యుత్ వ్యతిరేక పోరాట కమిటి నేతలు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా బోరభద్ర చేరుకున్న వైఎస్ జగన్.. 3051వ రోజుకు చేరుకున్న కాకరపల్లి థర్మల్ వ్యతిరేక నిరవధిక నిహారదీక్ష శిబిరాన్ని సందర్శించారు. అక్కడి ప్రజల సమస్యలను థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ నేతలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అక్కడి ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకున్నారు. తంపర భూములను పరిశీలించి స్వదేశీయ మత్స్యకారులకు లీజులు మంజూరు చేయాలని, అక్రమ రొయ్యల కుండీలను తొలగించాలని కోరారు. ప్రభుత్వం జారీ చేసిన 1108 జీవోతో సముద్రంలో చేపలు పట్టుకునే హక్కును కోల్పోయామని, జీవనోపాధి లేకుండా పోయిందని వాపోయారు. మత్స్యకారులను ఎస్సీలో చేర్చాలని కోరారు. తిట్లీ తుపానులో గృహాలను కోల్పోయిన వారికి ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ప్రతిపక్షనేతకు వినతి పత్రం అందజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని సమస్యలు పరిష్కరిస్తామని వైఎస్ జగన్ బాధితులు హామీ ఇచ్చారు.