కాకరాపల్లి ఉద్యమం దేశానికే ఆదర్శం
థర్మల్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా వడ్డి తాండ్రలో దీక్షలు చేపట్టి ఆరేళ్లు
వైఎస్సార్ సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్
సంతబొమ్మాళి: భూమి కోసం భుక్తి కోసం థర్మల్ ప్లాంట్ వద్దంటూ అలుపెరగని పోరాటం చేస్తున్న కాకరాపల్లి ఉద్యమం దేశానికే ఆదర్శమని వైఎస్సార్ సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయ కర్త దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. థర్మల్‌కు వ్యతిరేకంగా వడ్డితాండ్రలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించి సోమవారానికి ఆరేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పునరంకిత సభలో ఆయన మాట్లాడారు. తంపర భూములపై ఆధారపడి వేలాది మంది మత్స్యకార, రైతు కుటుంబాలు జీవిస్తున్నాయన్నారు. తంపరలో ఈస్టుకోస్టు థర్మల్ యాజమాన్యం ప్లాంట్‌ను నిర్మించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. థర్మల్‌ప్లాంట్ అనుమతులు రద్దు చేయాలని సంతకాలు సేకరించి పంచాయతీ అధికారి నుంచి ప్రధాన మంత్రి, రాష్ట్రపతి వరకు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించక పోవడం ప్రజాస్వామ్యానికే సిగ్గు చేటన్నారు. బతుకులను కాపాడుకునేందుకు పోరాటం చేసిన ముగ్గురు ఉద్యమకారులను చంపి, వందలాది మందిపై కేసులు బనాయించడం దురదృష్టకరమన్నారు.
థర్మల్‌ప్లాంట్ అనుమతుల జీవో రద్దు చేసేవరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ హక్కులు కోసం పోరాటం చేస్తున్న మత్స్యకారులను అణగదొక్కడం దారుణమన్నారు. జిల్లాను సర్వనాశనం చేసేందుకు కార్పొరేట్ వ్యక్తులతో కుమ్మక్కై ప్లాంట్లను నిర్మాణం చేసేందుకు చంద్రబాబు సర్కారు పూనుకుంటోందన్నారు. ప్లాంట్‌కు వ్యతిరేకంగా పోరాటం సాగిద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమాక్రసీ జిల్లా అధ్యక్షుడు తాండ్ర ప్రకాష్, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.వెంకటరావు, పోరాట కమిటీ కన్వీనర్ అనంతు హన్నూరావు, ఎంపీటీసీ సభ్యురాలు కోత ఇందిర, పోరాట కమిటీ నాయకులు పాల్గొన్నారు.