డేటా చోరీ ప్రకంపనలు.. తస్మాత్‌ జాగ్రత్త!

IT Professional Warnings Over IT Grids Scam And AP Data Breach Issue - Sakshi

ప్రస్తుతం రాష్ట్రమంతా ఒకటే చర్చ. డేటా చౌర్యం వార్తలతో తమ వ్యక్తిగత సమాచారం ఎంతవరకు భద్రం అనే అంశంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో థర్డ్‌ పార్టీ చేతుల్లోకి సున్నిత సమాచారం చేరడం ద్వారా ఎదురయ్యే పరిణామాల గురించి ఐటీ నిపుణులు విస్తుగొలిపే విషయాలు చెబుతున్నారు. ఫేస్‌బుక్‌ డేటా చౌర్యం మాదిరి మన డేటా కూడా లీక్‌ అయినట్లైతే గోప్యతా హక్కు ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఐటీ గ్రిడ్స్‌ స్కాం వెలుగులోకి వచ్చిన తాజా పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల వ్యక్తిగత సమాచార భద్రత ప్రమాదంలో పడింది.

ప్రభుత్వ పథకాలు పొందేందుకు మనలో చాలా మంది ఎప్పుడో ఒకసారి దరఖాస్తు చేసుకున్న వాళ్లమే. చంద్రన్న భీమా పథకం కోసమో, ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు కట్టుకోవాలనో లేదా ఆరోగ్య రక్ష ద్వారా లబ్ది పొందాలనో ఆశించిన వాళ్లమే. ఇందులో భాగంగా మన పేరు, చిరునామా, ఫొటో, ఆధార్‌ నంబర్‌, సామాజిక వర్గం తదితర విషయాలను ప్రభుత్వ అధికారులకు ఇచ్చి ఉంటాం. అయితే ఈ వివరాలన్నీ ప్రభుత్వం వద్దే కాదు.. టీడీపీ సేవామిత్ర యాప్‌లోకి చేరడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఈ రకంగా ప్రతి వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత, రహస్య సమాచారం ఒక ప్రైవేటు ఏజెన్సీ చేతుల్లోకి వెళ్లడం వల్ల పౌరులకే కాకుండా దేశ భద్రతకు కూడా ప్రమాదం పొంచి ఉంటుంది.

అసలేం జరుగుతోంది...
వివిధ ప్రభుత్వ విభాగాల పనితీరును మెరుగు పరచడంలో భాగంగా స్టేట్‌ రెసిడెంట్‌ డేటా హబ్‌ (ఎస్‌ఆర్‌డీహెచ్‌) కోసం ఇటీవల స్మార్ట్‌ పల్స్‌ సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ట్యాబ్‌ల ద్వారా ప్రజల సామాజిక, ఆర్థిక సమాచారాన్ని డిజిటల్‌ పద్ధతిలో సేకరించారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను ఆధార్‌ నంబర్‌ సహా ఎస్‌ఆర్‌డీహెచ్‌ పోర్టల్‌లో నిల్వ చేశారు. అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) ఈ సమాచారాన్ని తొలగించాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఎస్‌ఆర్‌డీహెచ్‌ పోర్టల్‌లోని డేటాను ధ్వంసం చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ధ్వంసం చేసినట్లుగా చెబుతున్న ఈ డేటాను ఐటీగ్రిడ్స్‌ అనే సంస్థ తన ‘సేవామిత్ర’యాప్‌ రూపకల్పనలో ఉపయోగించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వీటి ఆధారంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, ఓటర్ల వివరాలు, వారు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు తదితర అంశాలను సేకరించినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదకర ఫీచర్లు ఉన్న ఈ యాప్‌ ద్వారా పౌరుల ప్రైవేటు డేటాను వివిధ వర్గాలకు విక్రయించే అవకాశం ఉంది. ఇదే గనుక జరిగితే సైబర్‌ నేరగాళ్ల ఆగడాలకు మనం బలై పోవాల్సి ఉంటుంది. అందుకే ఎవరికైనా వివరాలు చెప్పే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం మంచిది. అయితే ప్రభుత్వాన్ని నమ్మి వివరాలు చెప్పినందుకు ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు ఎదురుకావడం నిజంగా విచారకరం.

ప్రమాదకర ఫీచర్లు..
సేవామిత్ర యాప్‌లో అనేక ప్రమాదకర ఫీచర్లు ఉన్నట్లు ఐటీ నిపుణులు చెబుతున్నారు. ఫోన్‌ స్లీపింగ్‌ మోడ్‌లోకి వెళ్లకుండా అడ్డుకోవడంతోపాటు వినియోగదారులు ఎక్కడ ఉన్నదీ (యూజర్‌ లొకేషన్‌) తెలుసుకోవచ్చని పేర్కొంటున్నారు. మన ఫోన్‌ స్టేటస్‌తో పాటు అందులోని వ్యక్తిగత ఫొటోలు, ఫైల్స్, ఇతర సమాచారాన్ని తెలుసుకోవడం సాధ్యమవుతుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఈ యాప్‌ ద్వారా యూఎస్‌బీ స్టోరేజీ ఫైల్‌ సిస్టమ్‌లోని సమాచారాన్నితెలుసుకోవడంతో పాటు... అందులోని సమాచారాన్ని మార్పిడి చేయడం లేదా తొలగించే సామర్ధ్యం కూడా ఉందని చెబుతున్నారు. పౌరుల ఆడియో రికార్డుతో పాటు వైఫై కనెక్షన్ల వివరాలు, నెట్‌వర్క్‌ కనెక్షన్లు, బ్లూటూత్‌తో అనుసంధానం, ఆడియో సెట్టింగ్‌లను కూడా మార్చడం వంటివి చేయడం ద్వారా హ్యాకింగ్‌ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. హ్యాకింగ్‌కు గురైతే మన బ్యాంకు ఖాతాల వివరాలు, పర్సనల్‌ ఫొటోలు, వివిధ వ్యక్తులతో మనం జరిపిన సంభాషణలు వీటితో పాటు పూర్తి గోప్యంగా ఉంచుకునే కొన్ని విషయాలు బహిర్గతమయ్యే ప్రమాదం ఉంది. తద్వారా ‘అభిమన్యుడు’ సినిమాలో మాదిరి మనల్ని మనం పూర్తిగా కోల్పోయే విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం సేవామిత్ర యాప్‌ వల్ల ఒక వ్యక్తి ఫోన్‌లో ఉన్న డేటా మొత్తం చౌర్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.

- అప్రాక్సిమేట్, ప్రిసైజ్‌ లోకేషన్ ‌: ఒక వ్యక్తి  ఫోన్‌ ఎక్కడ ఉందో తెలుసుకుంటారు. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోగానే లోకేషన్‌ సర్వీస్‌ ఆన్‌ అయిపోతుంది. దీనివల్ల బ్యాటరీ చార్జింగ్‌ కూడా త్వరగా అయిపోతుంది.

- ఫోన్‌ కాల్స్‌ : ఇది అత్యంత ప్రమాదకరమైన అనుమతి. మీతో సంబంధం లేకుండానే కాల్‌ లిస్ట్‌లో ఉన్న ఫోన్‌ నంబర్లకు నేరుగా ఫోన్‌ చేసి వాళ్లే మాట్లాడతారు. దీనివల్ల కాల్‌ చార్జీలు యజమానికి పడతాయి. అంతేకాదు ఈ యాప్‌ ఫోన్‌ నంబర్‌తో పాటు డివైస్‌ ఐడీని తెలుసుకోచ్చు.

- స్టోరేజ్‌ సిస్టమ్ ‌: యూఎస్‌బీ ద్వారా కూడా మెమరీలో ఉన్న సమాచారాన్ని మార్చవచ్చు, లేదా తొలగించవచ్చు. ఫోన్‌ స్టోరేజ్‌లో ఉన్న డేటాను స్వేచ్ఛగా వినియోగించుకుంటారు. యజమానికి సంబంధం లేకుండానే ఫోన్‌లో ఫోటోలు, వీడియోలు వంటి వాటిని మార్చవచ్చు, లేదా పూర్తిగా తొలిగించవచ్చు. యజమానికి తెలియకుండా సంబంధం లేని కంటెంట్‌ వచ్చి చేరిపోవచ్చు.

- మైక్రోఫోన్‌ : మైక్రోఫోన్‌ ద్వారా యజమాని అనుమతి లేకుండానే కాల్స్‌ను రికార్డ్‌ చేసుకుంటారు. అంటే యజమాని ఎవరితో ఏమి మాట్లాడారో వారికి తెలిసిపోతుంది.
 
- ఆడియో సెట్టింగ్స్ ‌: స్పీకర్‌కు సంబంధించిన ఆడియో సెట్టింగ్స్‌ మారిపోతుంటాయి. కాల్‌ మాట్లాడుతున్నప్పుడు  సౌండ్‌ పెంచడం తగ్గించడం చేస్తుంటారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top