గిరిజనుల విద్యాభివృద్ధికి కృషి | Sakshi
Sakshi News home page

గిరిజనుల విద్యాభివృద్ధికి కృషి

Published Sun, Feb 16 2014 3:02 AM

effort to tribal educational development

 పెద్దదోర్నాల, న్యూస్‌లైన్ : గిరిజనులందరినీ సంపూర్ణ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు విశేష కృషి చేస్తున్నట్లు గిరిజన సంక్షేమశాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ జీఎస్‌వీవీ ప్రసాద్ తెలిపారు. దానిలో భాగంగానే అధునాతన హంగులతో గిరిజన ఆశ్రమ పాఠశాలలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. మండల కేంద్రమైన పెద్దదోర్నాలలో గిరిజన బాలికల వసతి గృహం ఆవరణలో నిర్మిస్తున్న గిరిజనుల ఆశ్రమ పాఠశాల పనులను శనివారం ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ నల్లమల అటవీ ప్రాంతంలోని పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న గిరిజన విద్యార్థుల సంక్షేమం కోసం గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు అమలుచేస్తున్నామన్నారు. ప్రధానంగా వారి విద్యాభివృద్ధిపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. అందుకోసమే గిరిజన సంక్షేమ వసతి గృహాల స్థానంలో అధునాతన సదుపాయాలతో కూడిన ఆశ్రమ పాఠశాలలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. వాటిలో విద్యార్థుల సౌకర్యార్థం గార్మెంటరీ, డైనింగ్ హాల్, టాయిలెట్లతో పాటు నీటి అవసరాలు తీర్చేందుకు ఓవర్ హెడ్‌ట్యాంకులు నిర్మిస్తున్నట్లు వివరించారు.

ఆశ్రమ పాఠశాలల నిర్మాణాలు పూర్తై ప్రాంతాల్లో 15 నుంచి 20 లక్షల రూపాయల నిధులతో ఇప్పటికే ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోనే అత్యంత అధునాతన సదుపాయాలతో పెద్దదోర్నాలలో నిర్మిస్తున్న ఏకలవ్య మోడల్ పాఠశాలను ఏప్రిల్‌లోపు పూర్తిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రసాద్ పేర్కొన్నారు. దాంతోపాటు జిల్లాలోని వై.పాలెం, మార్కాపురం తదితర ప్రాంతాల్లో నిర్మిస్తున్న గిరిజన ఆశ్రమ పాఠశాలలను కూడా త్వరలో పూర్తిచేస్తామన్నారు. అనంతరం వాటి నిర్మాణ పనులను కూడా ఆయన పరిశీలించారు. ఆయన వెంట గిరిజన సంక్షేమశాఖ ఈఈ జగజ్యోతి, డీఈ లత, ఏఈ జయరాజ్, తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement