నాలుగేళ్లుగా నట్టేట | disadvantages to people after Y.S Rajashekara reddy died | Sakshi
Sakshi News home page

నాలుగేళ్లుగా నట్టేట

Sep 2 2013 3:52 AM | Updated on Mar 18 2019 7:55 PM

ఎవరి నోట విన్నా ఒకే మాట.. ఎవరిని కదిపినా ఒకటే అభిప్రాయం.. ఎవరిని ప్రశ్నించినా ఒకటే సమాధానం..

సాక్షి ప్రతినిధి, అనంతపురం :  ఎవరి నోట విన్నా ఒకే మాట.. ఎవరిని కదిపినా ఒకటే అభిప్రాయం.. ఎవరిని ప్రశ్నించినా ఒకటే సమాధానం.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే రాష్ట్రంలో ప్రస్తుత  పరిస్థితులు ఉత్పన్నమయ్యేవి కావని! రాష్ట్ర విభజన ప్రకటన వెలువడేది కాదని!!  వేర్పాటువాదం భూస్థాపితమయ్యేదని! దేశంలో అత్యంత ప్రజాకర్షక సీఎం అయిన వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించడం వల్లే ఇప్పుడీ దుస్థితి దాపురించిందని పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు సైతం అంగీకరిస్తున్నారు.
 
 2004కు ముందు వరుస ఓటములతో జీవశ్చవంలా మారిన కాంగ్రెస్ పార్టీకి అప్పటి ప్రతిపక్ష నేత అయిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజా పోరాటాలు, పాదయాత్ర ద్వారా ప్రాణవాయువు అందించారు. మాట తప్పని.. మడమ తిప్పని యోధుడిగా పేరొంది.. 2004 ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తేవడంలో కీలక భూమిక పోషించారు. 2004 మే 14న తొలిసారిగా సీఎం బాధ్యతలు స్వీకరించి.. ప్రజాభ్యుదయమే లక్ష్యంగా పనిచేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే పరమావధిగా ఐదేళ్లపాటూ సుపరిపాలన అందించారు.
 
 అభివృద్ధి, సంక్షేమ పథకాలను రెండు కళ్లుగా భావించి అమలు చేశారు. అందుకే  2004 -2009 మధ్య వైఎస్ పాలన సువర్ణయుగమని రాష్ట్ర ప్రజానీకం అభివర్ణిస్తోంది. ఐదేళ్ల వైఎస్ పాలనకు మెచ్చిన రాష్ట్ర ప్రజానీకం రాష్ట్ర, కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీకి రెండో సారి అధికారాన్ని కట్టబెట్టారు. 2009 మే 20న రెండో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ ప్రజారంజక పాలనను అందించే దిశగా సాగారు. ఆ క్రమంలోనే ప్రజల కష్టాలు తెలుసుకొనేందుకు రచ్చబండ నిర్వహించేందుకు వెళ్తూ 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన మరణం తర్వాత రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ కుక్కలు చింపిన విస్తరిగా మార్చింది. రాజకీయ లబ్ధి పొందేందుకు వేర్పాటువాదాన్ని రాజేసింది. ఆ క్రమంలోనే టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ దీక్ష చేశారు. ఆ దీక్షకు తలొగ్గి 2009 డిసెంబర్ 9న అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేశారు. ఇది సీమాంధ్రను అగ్నిగుండంగా మార్చింది. సీమాంధ్రలో సమైక్యఉద్యమానికి ‘అనంత’ చుక్కానిలా నిలిచింది. సమైక్యాంధ్ర ఉద్యమం దెబ్బకు అదిరిన కేంద్రం డిసెం బర్ 24న ప్రత్యేక తెలంగాణ ప్రకటనను వెనక్కి తీసుకుంది. ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు, రాష్ట్ర ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన శ్రీకృష్ణ కమిటీ ఆరు ప్రతిపాదనలతో కూడిన నివేదికను 2010 డిసెంబర్‌లో కేంద్రానికి అందించింది. ఆ నివేదికపై ఎలాంటి చర్యలూ తీసుకోకుండా మూడేళ్ల పాటు నాన్చిన కాంగ్రెస్ అధిష్టానం.. టీడీపీతో కుమ్మక్కై ఓట్లు, సీట్లే లక్ష్యంగా ఈ ఏడాది జూలై 30న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటన చేసింది.
 
 ఇది మళ్లీ సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని రాజేసింది. వేర్పాటువాదం,  సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల నాలుగేళ్లుగా రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. పాలన కుంటుపడింది. ఇది సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వైఎస్ హయాంలో జిల్లాలోని హిందూపురం పరిసర ప్రాంతాల్లో రూ.15 వేల కోట్ల వ్యయంతో బీడీఎల్(భారత్ డైనమిక్స్ లిమిటెడ్), బీఈఎల్(భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్), ఈసీఐఎల్(ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్), హెచ్‌ఏఎల్(హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్), హైటెక్ ఎలక్ట్రానిక్ సిటీ వంటి పరిశ్రమలను ఏర్పాటుచేయడానికి ముందుకొచ్చారు. అవి ఏర్పాటై ఉంటే.. ప్రత్యక్షంగా లక్ష మందికి ఉపాధి దొరికేది.
 
 కానీ.. రాజకీయ అనిశ్చితి వల్ల ఆ పరిశ్రమల పనులు ప్రారంభం కాలేదు. అలాగే హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకానికి మిగులు జలాల స్థానంలో నికర జలాలను ఇప్పటికీ కేటాయించలేదు. బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు ఆధారంగా ఆ ప్రాజెక్టుకు నికర జలాలు కేటాయించి ఉంటే.. హంద్రీ-నీవాకు ఏఐబీపీ(సత్వర సాగునీటి కల్పన పథకం) ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసే అవకాశం ఉండేది. అప్పుడు హంద్రీ-నీవా పథకాన్ని త్వరితగతిన పూర్తిచేసే వెసులుబాటు దొరికేది.  సంక్షేమ పథకాలదీ ఇదే తీరు. ప్రభుత్వం నాలుగేళ్లుగా తమను నట్టేట ముంచుతోందని ‘అనంత’ ప్రజానీకం వాపోతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement