
సాక్షి, అమరావతి: దేశంలోని ఉన్నత సాంకేతిక విద్యాసంస్థల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ(ఎంహెచ్‌ఆర్‌డీ) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ‘ఇన్నోవేషన్ సెల్’ను ఏర్పాటు చేయడంతో పాటు నూతన ఆవిష్కరణలు చేసే ఆయా సంస్థలకు ‘అటల్ ర్యాంకింగ్’విధానానికి శ్రీకారం చుట్టింది. యువతలో నూతన ఆలోచనలు, వారి ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించేందుకు ఈ ర్యాంకింగ్ విధానం చేపట్టింది. భవిష్యత్ అంతా నూతన ఆవిష్కరణలపైనే ఆధారపడి ఉందని, దేశం సుస్థిర అభివృద్ధి సాధించాలంటే ఉన్నత విద్యాసంస్థల్లో వినూత్న ఆవిష్కరణలు మరింతగా సాగాలని కేంద్రం దీన్ని ఏర్పాటు చేస్తుంది.
ఆవిష్కరణలకు అటల్ ర్యాంకింగ్
వినూత్న ఆవిష్కరణల కోసం ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అటువంటి ఆవిష్కరణలను చేపట్టే సంస్థలకు అటల్ ర్యాంకింగ్‌లను ఇచ్చేందుకు ‘అటల్‌ర్యాంకింగ్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్‌మెంట్సు’(ఏఆర్‌ఐఐఏ)ను ఏర్పాటు చేసింది. విద్యాసంస్థల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం కోసం దీన్ని నెలకొల్పింది. నూతన ఆవిష్కరణలు కేవలం సాంకేతిక విద్యాసంస్థల్లోనే కాకుండా అన్ని విద్యాసంస్థల్లోనూ సాగేందుకు ఈ అటల్‌ర్యాంకింగ్‌లో చోటు కల్పిస్తుంది.
కొత్త ప్రదేశాలకు వెళ్లి అక్కడి ప్రజలతో మమేకమై, సంస్కృతులను తెలుసుకోవడమే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న నెట్‌వర్క్ ఆఫ్ ఇన్నోవేషన్ క్లబ్‌ల విధివిధానాలను కేంద్రం త్వరలోనే ప్రకటించనుంది. విద్యార్థులు, అధ్యాపకులు ఈ క్లబ్‌లో భాగస్వాములై కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ నిర్వహించే వివిధ ఆవిష్కరణల పోటీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రతినెల జరిగే ఈ పోటీల్లోని విజేతలకు బహుమతులతో పాటు ధ్రువపత్రాలను కేంద్ర ప్రభుత్వం అందించనుంది. ఈ అటల్ ర్యాంకింగ్‌లకు ఆయా సంస్థలు దరఖాస్తు చేసుకోవడానికిగాను అక్టోబర్ 15 నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తులను కేంద్రం అందుబాటులో ఉంచనుంది. నవంబర్ 30 వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. ర్యాంకింగ్ జాబితాను 2019 ఏప్రిల్‌లో ప్రకటిస్తుంది.
ర్యాంకింగ్‌లో 5 అంశాలకు ప్రాధాన్యం
- అటల్ ర్యాంకింగ్‌లో అయిదు అంశాలకు ప్రాధాన్యమివ్వాలన్నది ఎంహెచ్‌ఆర్‌డీ భావన. ఈ అంశాల ఆధారంగా కేంద్రం ఆయా సంస్థలకు వెయిటేజీ ఇచ్చి అనంతరం ర్యాంకింగ్ ప్రకటిస్తుంది.
- నూతన ఆవిష్కరణలు, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ల ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తూ ఆయా సంస్థలకు బడ్జెట్ ఖర్చులను సమకూర్చడం. దీనికి 20 పాయింట్లు వెయిటేజీ ఇస్తారు.
- ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సదుపాయాలు కల్పిస్తూ సహకారం అందించడం, అందుకు వీలుగా అడ్వాన్సు సెంటర్లు ఏర్పాటు చేయడం. దీనికి 10 పాయింట్లు వెయిటేజీ.
- ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వినూత్న ఆలోచనలు అందించడం. దీనికి 54 పాయింట్ల వెయిటేజీ.
- బోధనాభ్యసనాల ద్వారా ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధిపర్చడం. దీనికి 10 పాయింట్ల వెయిటేజీ.
- తమ విద్యాసంస్థల పాలనా వ్యవహరాలకు అనువుగా అత్యుత్తమ వినూత్న ఆవిష్కరణలను అభివృద్ధిపర్చడం. దీనికి 6 పాయింట్లు ఉంటాయి.