వెండితెరపై ‘ఓటు’మాటలు

About Vote In Movies - Sakshi

అలాంటి గెలుపు వద్దు
గ్రామ సర్పంచ్‌ ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పటి వరకూ సర్పంచ్‌ పదవిలో ఉన్న శేషాద్రి (నాగభూషణం) డబ్బు గుమ్మరించి అట్టహాసంగా ప్రచారం చేస్తూంటాడు. ప్రత్యర్థి గోపి (అక్కినేని) వద్దకు మిత్రులు పరుగెత్తుకుని వస్తారు.
‘‘గోపీ! వాళ్లు భక్తీముక్తీ అంటూ ఊదరగొట్టేస్తున్నారు. ఇలా అయితే లాభం లేదు. నువ్వు ‘ఊ?’ అను. డబ్బు గుమ్మరించేస్తాను.’’ – డబ్బు ఉన్న నేస్తం గోపీకి సలహా ఇస్తాడు.
‘‘అలా వచ్చే గెలుపు మనకు ఎన్నటికీ వద్దు. ఆశపెట్టి, మోసం చేసి వచ్చే లక్ష ఓట్లకన్నా, నీతిగా, నిజాయితీతో నచ్చజెప్పి సంపాదించే ఒక్క ఓటు మనకు ముఖ్యం. ఒకవేళ ఇవాళ మనం గెలవలేకపోయినా, రేపటి మన విజయానికి ఈ ఒక్క ఓటు బీజం అవుతుంది.’’ అని గోపీ అంటాడు.
– సినిమా : ‘బుద్ధిమంతుడు’. రచయిత : ముళ్ళపూడి వెంకట రమణ

గెలవడమే ముఖ్యం
తన ప్రేమ కోసం పోటీ పడుతున్న రాజబాబు, కేవీ చలం మధ్య బట్టలన్నీ ఉతికేయాలని హంస (రమాప్రభ) పోటీ పెడుతుంది. ఆమె ప్రేమను అందుకోవడానికి పోటీ పడుతున్న ఆ ఇద్దరూ బట్టలు ఉతకడం మొదలు పెడతారు.
రాజబాబు కేవీ చలం కంటిలో సబ్బు నురగపోసి, ‘హంసా! నేనే గెలిచాను’ అని ప్రకటించుకుంటాడు.
‘మోసం! కంట్లో నురగ పోసి గెలిచాడు’ అని చలం బావురుమంటాడు.
‘ఎలా గెలిస్తే ఏమిట్రా! గెలవడమే ప్రధానం. ఎప్పుడయినా ఎలచ్చన్లు చూసిన ముఖమేనా ఇది?’ అని రాజబాబు అంటాడు.
– సినిమా : ప్రేమ్‌నగర్‌. రచన : ఆచార్య ఆత్రేయ

హెచ్చెను హింసా ద్వేషం.. ఏమవుతుందీ దేశం!
గాంధి పుట్టిన దేశమా ఇది! నెహ్రు కోరిన సంఘమా ఇది!
సామ్యవాదం, రామరాజ్యం సంభవించే కాలమా!

యువకుల శక్తికి భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు
ఉన్నది మనకు ఓటు.. బ్రతుకు తెరువుకే లోటు

సిఫార్సు లేనిదే శ్మశానమందున దొరకదు రవంత చోటు
పేరుకే ప్రజలదే రాజ్యం పెత్తందార్లకే భోజ్యం

అధికారముకై పెనుగులాటలో అన్నాదమ్ముల పోటీ
హెచ్చెను హింసా ద్వేషం.. ఏమవుతుందీ దేశం!
– సినిమా : పవిత్రబంధం. రచన : ఆరుద్ర

‘నేనే’ ముఖ్యం
దేశం కన్నా రాష్ట్రం, రాష్ట్రం కన్నా ఊరు, ఊరి కన్నా వాడ, వాడ కన్నా పార్టీ, పార్టీ కన్నా గ్రూపు, గ్రూపు కన్నా నాయకుడు, నాయకుడి కన్నా అతడి పెట్టుబడిదారు, అతడి కన్నా ‘నేనే’ ముఖ్యమని ‘రాజనీతి’లో అంటారు.

ఊసరవెల్లి
‘నువ్వు చెప్పు సుబ్బరాజూ! పార్టీలే రంగు మారుస్తున్న ఈ రోజుల్లో, కొన్ని పార్టీలు జుట్టుకో రంగు, మీసానికో రంగు, రాష్ట్రానికో రంగు, అవసరానికో హంగు మారుస్తున్న కాలంలో రంగు మీద రంగేస్తున్న పరిస్థితుల్లో బుచ్చబ్బాయిని ఊసరవెల్లి అని తిట్టడం సబబేనంటావా?’ అన్నాడు రెడ్డిగారు.

‘అబ్బే, అసలు బుచ్చబ్బాయి ఊసరవెల్లి కాడు. మొదట్నుంచి చివరి దాకా బుచ్చబ్బాయి కోరిక మినిస్ట్రవాలనే. అదే అతని పార్టీ. అదే పాలసీ. అదే ఆశయం. ఏ పార్టీలో ఉన్నా కానీ, అతని మనసులో కాని, అతని పద్ధతిలో గాని ఎన్నడూ మార్పు లేదు.’ సుబ్బరాజు సమాధానం.
పార్టీలు మారుస్తున్న బుచ్చబ్బాయి గురించి ‘రాజకీయ బేతాళ పంచవింశతి’ కథల్లో.. 
రచయిత ముళ్ళపూడి వెంకట రమణ

సేకరణ : వారణాసి సుబ్రహ్మణ్యం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top