
నేటి మాక్‌డ్రిల్‌లో ఉత్సాహంగా పాల్గొనండి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): దేశవ్యాప్తంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించే ‘సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్’లో అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఆదిత్య మంగళవారం తెలిపారు. ఇటీవల కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి, సైబర్ దాడులు, శత్రు చర్యల వంటి సరిహద్దు భద్రతాపరమైన ముప్పు పెరిగిపోతోందన్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించే మాక్ డ్రిల్, పౌరుల, వివిధ సంస్థల సన్నద్ధతను బలోపేతం చేయడంలో ఒక కీలకమైన చర్య అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ మాక్ డ్రిల్‌లో పాల్గొనాలన్నారు.
ధాన్యాన్ని వెంటనే
మిల్లులకు తరలించండి
డీపీఎం రాజయ్య
మిరుదొడ్డి(దుబ్బాక): కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే లారీల ద్వారా మిల్లులకు తరలించాలని డీపీఎం (జిల్లా ప్రాజెక్టు మేనేజర్) రాజయ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని అందె, అక్బర్‌పేట– భూంపల్లి మండల కేంద్రంతో పాటు, ఖాజీపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన సందర్శించారు. కేంద్రాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్ల జాప్యంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకుని కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని సూచించారు. వర్షాల కారణంగా ధాన్యం తడవకుండా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎం డాకయ్య తదితరులు పాల్గొన్నారు.