ఫేక్‌ న్యూస్‌తో జాగ్రత్త సుమా! | Sakshi Guest Column On Fake News in Social Media | Sakshi
Sakshi News home page

ఫేక్‌ న్యూస్‌తో జాగ్రత్త సుమా!

Published Sun, May 11 2025 1:36 AM | Last Updated on Sun, May 11 2025 1:36 AM

Sakshi Guest Column On Fake News in Social Media

అభిప్రాయం

దేశం యుద్ధ పరిస్థితుల్లో కూరుకుపోయిన సమయంలో శత్రువులు మన ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికీ, తమదే పైచేయి అని చెప్పడానికీ అనేక తప్పుడు వార్తలను ప్రచారం చేశారు. అదే సమయంలో కొందరు భారతీయులూ సోషల్‌ మీడియాలో నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఇష్టమొచ్చినట్లు రాశారు. ఇది మంచి పద్ధతి కాదు. రాజ్యాంగం ఇచ్చిన భావ వ్యక్తీకరణ హక్కును అనుసరించి ప్రతి పౌరుడు తన అభిప్రాయాలను, నమ్మకాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంది. కానీ దాన్ని దుర్వినియోగపరచడం క్షంతవ్యం కాదు. 

పహెల్‌గామ్‌లో పర్యాటకులను ఉగ్రవాదులు చంపిన నేపథ్యంలో భారత్‌ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్‌పై దౌత్యపరమైన చర్యలు తీసుకుంది. పాక్‌ ప్రభుత్వ అధికారిక ఎక్స్‌ అకౌంట్‌ను భారత్‌లో అందుబాటులో లేకుండా నిలిపి వేసింది. పలువురు పాక్‌ జర్నలిస్టులకు చెందిన ఎక్స్‌ ఖాతాలను కూడా నిషేధించింది. తప్పుడు, రెచ్చ గొట్టే, సున్నితమైన మతపరమైన అంశాల కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నాయని ఆరోపిస్తూ కేంద్రం 16 పాకిస్తాన్‌ యూట్యూబ్‌ చానళ్లపై కూడా నిషేధం విధించింది. 

ఇందులో పాక్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అఖ్తర్‌కు చెందిన యూట్యూబ్‌ చానల్‌ కూడా ఉంది. హోం శాఖ సిఫారసు మేరకు డాన్‌  న్యూస్, జియో న్యూస్, సమా టీవీ, సునో న్యూస్,ద పాకిస్తాన్‌ రిఫరెన్స్‌ తదితర యూ ట్యూబ్‌ చానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. ఆ తర్వాత పాక్‌ రక్షణ మంత్రి ఎక్స్‌ ఖాతాను కూడా నిలిపివేసింది. అలాగే పాక్‌ సినిమాల ప్రదర్శనపైనా నిషే«దం అమలులోకి వచ్చింది. 

అలాగే భారత్‌లోని అనేక వెబ్‌సైట్లనూ, యూట్యూబ్‌ చానళ్లనూ ప్రభుత్వం బ్లాక్‌ చేసింది. అందులో ‘ద వైర్‌’ న్యూస్‌ పోర్టల్‌ ఒకటి. ఇటువంటి వెబ్‌సైట్‌ను నిషేధిత జాబితాలో చేర్చడం న్యాయం కాదని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా జనరల్‌ సెక్రెటరీ డి.రాజా ఖండించారు. ‘ద వైర్‌’ వంటి వెబ్‌సైట్‌ను నిషేధించవలసిన అవసరం లేదు. 

ఆ పేరుమీద పత్రికా స్వేచ్ఛను నిలిపివేయడం న్యాయం కాదు. జాతీయ సమగ్రత కోసం పహెల్‌గామ్‌లో ఉగ్రవాదుల చర్యను ఖండించడం మంచిదే కాని, వైర్‌ను నిషేధించడం న్యాయం కాదని ‘ఇంటర్నెట్‌ ఫ్రీడం ఫౌండేషన్‌’ న్యాయవాదీ, ఫౌండర్‌ డైరెక్టర్‌ అయిన అపర్‌ గుప్తా అన్నారు. ఫేక్‌ న్యూస్‌ను ప్రచారం చేయడం పరోక్ష యుద్ధంలో భాగం. 

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరిలో ఆర్మీ బ్రిగేడ్‌పై సూసైడ్‌ దాడి జరిగినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఏడు వీడియోలు పరిశీలించి అన్నీ అబద్ధాలే అని తేల్చింది. పంజాబ్‌లోని జలంధర్‌పై డ్రోన్‌ దాడి జరిగినట్లు వచ్చిన వార్త కూడా కల్పితమే అని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఓ పాత వీడియోపై కూడా ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) వివరణ ఇచ్చింది. 

వాస్తవానికి ఆ క్షిపణి దాడి 2020లో లెబనాన్‌లోని బీరూట్‌లో జరిగిన పేలుడు ఘటన అని ప్రభుత్వం పేర్కొన్నది. ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌... ఆర్మీ కంటోన్మెంట్‌పై ఫిదాయీ సూసైడ్‌ దాడి జరగ లేదని చాలా స్పష్టంగా వెల్లడించింది. ఇండియన్‌ ఆర్మీ పోస్టును పాకిస్తానీ దళాలు ధ్వంసం చేసినట్లు ప్రచారం అయిన మరో వీడియో కూడా ఫేక్‌ అని ప్రభుత్వం తేల్చింది. భారతీయ సైన్యంలో 20 రాజ్‌ బెటాలి యన్‌ అనే యూనిట్‌ లేనే లేదని ఫ్యాక్ట్‌ చెక్‌ పేర్కొన్నది. 

పాకిస్తాన్‌లోని ప్రధాన మీడియాతో పాటు కొందరు సోషల్‌ మీడియాలో భారత ప్రజల్లో భయాందోళనలు కలిగించే లక్ష్యంతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిచేశారు. ఏది వాస్తవమో, ఏది
కాదో తేల్చుకోవలసింది మనమే!

మాడభూషి శ్రీధర్‌  
వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ
‘స్కూల్‌ ఆఫ్‌ లా’ ప్రొఫెసర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement