ఆ రికార్డుకు 11 ఏళ్లు.. | Watch Video, 11 Years Ago Sachin Went past Brian Laras Record | Sakshi
Sakshi News home page

ఆ రికార్డుకు 11 ఏళ్లు..

Oct 17 2019 4:41 PM | Updated on Mar 21 2024 8:31 PM

న్యూఢిల్లీ: సచిన్‌ టెండూల్కర్‌.. భారత్‌ క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన క్రికెటర్‌. తన ఆటతో ప్రేక్షకుల్ని కట్టి పడేసిన ఘనత సచిన్‌ సొంతం. ప్రత్యేకంగా సచిన్‌ శకం నడిచిందంటే అతిశయోక్తి కాదేమో. టెస్టుల్లో 51 సెంచరీలు, వన్డేల్లో 49 సెంచరీలు కలుపుకుని మొత్తం 100 శతకాలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌ సచిన్‌. టెస్టుల్లో, వన్డేల్లో కూడా అత్యధిక పరుగులు రికార్డును తన పేరిట లిఖించుకున్న దిగ్గజం. కాగా, ఇప్పటికీ మాస్టర్‌ బ్లాస్టర్‌గా కీర్తించబడుతున్న సచిన్‌కు ఈరోజు(అక్టోబర్‌ 17) చాలా ప్రత్యేకం. 2008లో సరిగ్గా ఇదే రోజు సచిన్‌ ఒక అరుదైన ఘనతను సాధించాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డును సచిన్‌ టెండూల్కర్‌ తన పేరిట లిఖించుకున్న రోజు ఇది.

11 ఏళ్ల క్రితం బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా మొహాలీలోని పీసీఏ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్‌ అత్యధిక పరుగుల రికార్డును సాధించాడు. అప్పటికి వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా పేరిట ఉన్న రికార్డును సచిన్‌ బ్రేక్‌ చేశాడు. అది సచిన్‌కు 152వ టెస్టు మ్యాచ్‌.  లారా 11, 953 పరుగులతో టాప్‌లో ఉండగా, దాన్ని సచిన్‌ బద్ధలు కొట్టాడు. ఓవరాల్‌గా 200 టెస్టు మ్యాచ్‌లు ఆడిన సచిన్‌.. 15,921 పరుగులు చేశాడు. ఇది నేటికి సచిన్‌ పేరిట పదిలంగా ఉండటం మరో విషయం. ఆనాటి ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్‌ 88 పరుగులు సాధించాడు. 1989లో అంతర్జాతీయ అరంగ్రేటం చేసిన సచిన్‌ 1994, సెప్టెంబర్‌ 9న మొదటి సెంచరీ సాధించాడు. 78 మ్యాచ్‌లు ఆడిన తర్వాతే తొలి శతకం అతడి ఖాతాలో పడింది. కొలంబోలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మేటి బౌలర్లను ఎదుర్కొని 130 బంతుల్లో 110 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. 2008లో సరిగ్గా ఇదే రోజు సచిన్‌ ఒక మైలురాయిని చేరిన సంగతిని గుర్తు చేస్తూ బీసీసీఐ తన ట్వీటర్‌ అకౌంట్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేసింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement