సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం జొన్నవాడ కామాక్షి ఆలయం వద్ద అర్చకులు, ఆలయ సిబ్బంది నన్ను కలుసుకున్నారు. ‘మీరు అధికారంలోకి రావాలి’అంటూ మనసారా ఆశీర్వదించారు. ఆ క్షణంలోనే వారి కష్టాలు, కన్నీళ్లు నా ముందుంచారు. ‘మీ నాన్నగారి పాలనలో మాకో గౌరవం ఉండేది. ఆనందంగా బతికేవాళ్లం. ఆలయాల్లో వంశపారంపర్య హక్కులు కల్పించి ప్రోత్సహించారు’అని గర్వంగా చెప్పారు. ఆయన తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వల్లే పేద బ్రాహ్మణుల పిల్లలకు ఉన్నత విద్య అబ్బిందన్నారు. చంద్రబాబు పాలనలో ఎన్నో అగచాట్లు పడుతున్నట్టు తెలిపారు. ధూప దీప నైవేద్య ఆలయాలను 13 వేల నుంచి 3 వేలకు కుదించారని, బతుకే భారమన్నట్టు బతకులీడుస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయాలని, వంశపారంపర్య హక్కును పునరుద్ధరించాలని ఈ ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనికరించడం లేదని వాపోయారు. ఆశీర్వదించే ఆ వేద పండితులకే.. చేయి చాచే దయనీయ పరిస్థితి రావడం దారుణం. గుడి భూములే మింగేసే చంద్రబాబు సర్కారులో.. ఇక అర్చకులకు, సిబ్బందికి న్యాయం జరుగుతుందా?