ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం కేసుకు సంబంధించి హైకోర్టు మంగళవారం పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో తాము ఆదేశాలు ఇచ్చేంతవరకు సంబంధిత కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయవద్దని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది. జగన్‌పై హత్యాయత్నం కేసులో హడా వుడిగా, మొక్కుబడిగా దర్యాప్తు చేసి వీలైనంత త్వరగా కేసుకు ముగింపు పల కాలన్న ఆలోచనతో పోలీసులున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఇదే సమయంలో తనపై జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తు బాధ్యతలను స్వతంత్ర సంస్థకు అప్పగించాలని వైఎస్ జగన్ కోరుతున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలను హైకోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, విశాఖ సిటీ ఏసీపీ, 5వ పట్టణ ఎస్‌హెచ్‌వో, తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ డీజీపీలకు న్యాయ స్థానం నోటీసులు జారీ చేసింది.