ఈ రోజు నెల్లూరు దాటి ప్రకాశం జిల్లాలోకి అడుగు పెట్టాను. ఏచోటికెళ్లినా ఎండమావులే. ఏ ఎదను కదిపినా వేడి నిట్టూర్పులే. ఏ ప్రాంతం అయితే ఏంటి.. పేదోడి ఇంట కష్టాలూ, కన్నీళ్లే. పెదపవని గ్రామానికి చెందిన ఆదెమ్మ ఆవేదన చూశాక గుండె బరువెక్కింది. కూలి చేసే ఆమె భర్త మంచానపడ్డాడు. ఒక్కగానొక్క కొడుకు పెళ్లయిన ఏడాదికే కిడ్నీలు చెడిపోయి చావుతో పోరాడుతున్నాడు. కడుపుతీపి చంపుకోలేక తన కిడ్నీ ఇవ్వాలనుకుందా తల్లి. కానీ ఆమెకూ గర్భసంచి క్యాన్సరట. పోనీ, అవయవదానం ద్వారా కిడ్నీ మార్పిద్దామనుకుంటే.. ఆరోగ్యశ్రీ వర్తించదట. రూ.6 లక్షలు ఖర్చవుతుందట. ఏం చేయాలా తల్లి? ఎవరికి చెప్పుకోవాలి ఆమె ఘోష? సింగరపాలేనికి చెందిన 83 ఏళ్ల అవ్వ లచ్చమ్మ తన కష్టాలు చెప్పింది.