- విచారణ అధికారిముందే బూతులు
- డిప్యూటీ ఈఓకు ఫిర్యాదు
మెంటాడ: విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలస జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం రామకృష్ణ మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. విచారణ అధికారి ముందే ఎస్‌ఎంసీ చైర్మన్ పెదిరెడ్ల సత్యనారాయణపై బూతులతో చెలరేగిపోయారు. దాడికి సైతం ప్రయత్నించారు. ఆయన చేయి మరో ఉపాధ్యాయుడు పెదిరెడ్ల సూర్యారావు ముఖానికి తగలడంతో కళ్లద్దాలు కింద పడిపోయాయి. హెచ్‌ఎం రామకృష్ణ, గణిత ఉపాధ్యాయుడు పైల వెంకటగిరి తరచూ మద్యం తాగి పాఠశాల విధులకు హాజరవుతున్నారని డిప్యూటీ ఈవో (ఎంఈఓ) మోహనరావుకు గ్రామస్తులు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన పాఠశాలలో గురువారం విచారణ జరిపారు.
ఆ సమయంలోనూ హెచ్‌ఎం మద్యం మత్తులో ఉండి గ్రామస్తులపై రెచ్చిపోయారు. గతంలోనూ మద్యం తాగి రావడంతో ఫిర్యాదు చేశామని, అప్పటి అధికారులు హెచ్చరించి వెళ్లినా ఆయనలో ఏ విధమైన మార్పు రాలేదని గ్రామస్తులు తెలిపారు. అప్పుడప్పుడు పాఠశాలలోనే మద్యం తాగుతున్నారంటూ తరగతి గదుల పక్కన ఉన్న మద్యం సీసాలను చూపించారు. హెచ్‌ఎం, గణిత ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని విచారణ అధికారి తెలిపారు.