కమిటీ సభ్యులే సైన్యంగా మారాలి | - | Sakshi
Sakshi News home page

కమిటీ సభ్యులే సైన్యంగా మారాలి

Dec 3 2025 8:03 AM | Updated on Dec 3 2025 8:03 AM

కమిటీ

కమిటీ సభ్యులే సైన్యంగా మారాలి

ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

మైదుకూరు : గ్రామ కమిటీలు రాబోవు రోజుల్లో వైఎస్సార్‌సీపీకి తిరుగులేని సైన్యంగా మారాలని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తెలిపారు. మైదుకూరులోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు శెట్టిపల్లె రఘురామిరెడ్డి అధ్యక్షతన గ్రామ, వార్డు కమిటీల నియామక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీని సంస్థాగతంగా నిర్మించుకునేందుకే గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. నిఖార్సైన కార్యకర్తలను మాత్రమే కమిటీల్లోకి తీసుకోవాలని సూచించారు. ఇప్పటిదాకా పార్టీ ప్రజల్లో ఉందంటే అందుకు దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశీస్సులు, ప్రజల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్న తిరుగులేని అభిమానం, కార్యకర్తల రెక్కల కష్టమే కారణాలని తెలిపారు. గ్రామ కమిటీలు పార్టీకి మంచిదని అదే విధంగా కార్యకర్తలకూ మంచిదని పేర్కొన్నారు. కమిటీల ఏర్పాటు ఈనెల 19 కల్లా పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యమైన నాయకులు షెడ్యూలు చేసుకుని గ్రామాల్లో తిరిగి రచ్చబండ పెట్టి నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు.

కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం..

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఈ ప్రభుత్వం మంగళం పాడిందని ధ్వజమెత్తారు. విద్యా ర్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, పేద ప్రజలకు ఆరోగ్యశ్రీని ఎత్తేసిందని విమర్శించారు. ఒక్క రూపాయి కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు అందని పరిస్థితి ఏర్పడిందన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక పథకాలను అమలు చేశారని, రైతు భరోసా, ఇన్‌పుట్‌ సబ్సిడీ వంటివి రైతులకు ఎంతో మేలు చేశాయని గుర్తు చేశా రు. చంద్రబాబు అన్నదాత సుఖీభవ కింద ఇప్పటికి రూ.40వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.5వేలు, రూ.10వేలుతో సరిపెట్టారని విమర్శించారు. వైఎస్‌ జగన్‌ మళ్లీ సీఎం అయ్యాక కార్యకర్తలను ముందు పెట్టి పాలన సాగిస్తారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై ఆధారపడి నిర్లక్ష్యంగా ఉండవద్దని కార్యకర్తలను హెచ్చరించారు. మన కష్టంతోనే రాబోవు ఎన్నికల్లో అధికారంలోకి రావాలని అన్నారు. అందుకు తొలి అడుగే ఈ గ్రామ కమిటీలని తెలిపారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్‌ జగనే సీఎం

ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం తథ్యమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు రఘురామిరెడ్డి తెలిపారు. నియోజకర్గంలోని 114 యూనిట్లలో ఉగాది నాటికి 11వేల మందికి క్యూ ఆర్‌కోడ్‌తో ఉన్న గుర్తింపు కార్డులను అందజేస్తామని పేర్కొన్నారు. ఈనెల 21న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా కమిటీల సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. ప్రతి కార్యకర్త వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు పాటుపడాలని పిలుపునిచ్చారు.

వైఎస్‌ జగన్‌ 2.0లో కార్యకర్తలకే పెద్దపీట

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండో సారి అధికారం చేపట్టాక కార్యకర్తలకు పెద్దపీట వేయనున్నారని పార్టీ మూడు అంచల వ్యవస్థ రాష్ట్ర పరిశీలకుడు వజ్ర భాస్కర్‌రెడ్డి అన్నారు. రాబోవు రోజుల్లో అన్ని పనులు కమిటీల్లో ఉన్న వారి ద్వారానే జరుగుతాయని తెలిపారు. పార్లమెంట్‌ పరిధిలో ఈనెల 21న 902 యూనిట్ల సమావేశం జరుగుతుందని అది రాష్ట్రానికే దిక్చూచిగా ఉండనుందన్నారు. సదస్సులో వ్యవసాయ ప్రభుత్వ మాజీ సలహాదారుడు ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, ఉద్యాన మాజీ సలహాదారుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, జిల్లా నాయకులు మదీనా దస్తగిరి, నేట్లపల్లె శివరాం, కిరణ్మయి, పీవీ రాఘవరెడ్డి, చిరాకి బాషా నియోజకవర్గంలోని అన్ని మండలాల కన్వీనర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.

సదస్సులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు .. మాట్లాడుతున్న ఎంపీ అవినాష్‌రెడ్డి, చిత్రంలో మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, వజ్రభాస్కర్‌ రెడ్డి తదితరులు

కమిటీ సభ్యులే సైన్యంగా మారాలి 1
1/1

కమిటీ సభ్యులే సైన్యంగా మారాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement