రిజిస్ట్రేషన్లపై ‘పచ్చ’ రైటర్ పెత్తనం
● టీడీపీ నేత, దస్తావేజు లేఖరి కుమ్మక్కు
● చక్కబెట్టిన అనేక అక్రమ రిజిస్ట్రేషన్లు
● ఏసీబీ దాడులను లెక్క చేయని వైనం
రాజంపేట : అతను సబ్ రిజిస్ట్రేషన్ ఉద్యోగి కాదు.. అందులో పని చేసే అవుట్‌సోర్సింగ్ సిబ్బంది కాదు.. కేవలం స్థానిక టీడీపీ నేత అండ ఉన్న ఓ రైటర్.. ఆయనపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. వీరి కనుసన్నలో అక్రమ రిజిస్ట్రేషన్లకు తెర తీసినట్లుగా తెలుస్తోంది. ఈ రైటర్ మండలంలో రెవెన్యూ భూ అక్రమాల ఆరోపణల్లో కీలక పాత్ర పోషించిన ఓ మాజీ వీఆర్వో సంబంధీకుడు కావడంతో.. కొన్నేళ్లుగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యకలాపాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.
కొన్నేళ్లుగా..
ఈ రైటల్ కొన్నేళ్లుగా రాజంపేట సబ్ రిజిస్ట్రారు కార్యాలయాన్ని శాసిస్తూ వస్తున్నారనే విమర్శలు వెలువడుతున్నాయి. సబ్‌రిజిస్ట్రారు కార్యాలయం వద్ద ఎందరో రైటర్లు ఉన్నారు. వారంతా కూడా తమ హద్దు వరకే క్రయ, విక్రయ విషయాల్లో జోక్యం చేసుకుంటారు.
‘బా’గా బలిసిన రైటర్
‘బా’గా బలసిన రైటర్ కావడంతో రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో అక్రమమైనా సరే నేరుగా ఆయన దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేసే వరకు అన్ని చూసుకోవడంతో.. లక్షలకు లక్షలు సంపాదిస్తూ, అధికార పార్టీ అండతో చెలరేగిపోతున్నాడు. సబ్ రిజిస్ట్రారు కార్యాలయ సిబ్బందితో సహా తోటి రైటర్లు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. సబ్‌రిజిస్ట్రారు కార్యాలయంలో చాలా మంది సిబ్బందితో మనీ మ్యాటర్ కొనసాగించి, వారి నుంచి అనేక విధాలుగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకోవడంలో దిట్టగా నిలిచారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఏసీబీ దాడులు జరిగినా..
గత నెలలో రాజంపేట సబ్ రిజిస్ట్రారు కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. తెల్లవారే వరకు వారు విస్తృతంగా రిజిస్ట్రేషన్‌ల రికార్డులు తనిఖీ చేశారు. కొంత మంది రైటర్లను కూడా ఏసీబీ ట్రాప్ చేసింది. వారిని విచారణ చేసి వదిలేసింది. అదే ఇప్పుడు పెద్ద తప్‌పైందని పలువురు తమ భావనలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రైటర్ల వాహ తిరిగి కొనసాగడం ఇందుకు బలం చేకూరుస్తోంది. ఈ రైటర్ల బృందంలో ‘బా’గా బలసిన రైటర్.. తన సహకారంతో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకున్న ఓ టీడీపీ నేత అండదండలతో మళ్లీ చెలరేగిపోతున్నారు. ఇందుకోసం వ్యూహాలు రూపొందించి కలెక్షన్లు చేపట్టారనే విమర్శలున్నాయి.
కలెక్షన్లు ఎవరి కోసం..
సబ్‌రిజిస్ట్రారు కార్యాలయం భవనం చుట్టుపక్కల ఉన్న రైటర్ల వద్ద ఓ రైటర్ లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లుగా మీడియా గ్రూపులో వైరల్ అయింది. దీంతో రైటర్లు ఎవరిమటుకు వారు హైరానా పడ్డారు. ఒక్కొక్క డాక్యుమెంట్ రైటర్ వద్ద నుంచి రూ.5 వేలు వసూలు చేసినట్లు తెలిసింది. అయితే ఈ డబ్బులు ఎందుకు వసూలు చేశారు. ఎవరి కోసం చేశారన్నది ఇప్పుడు సబ్‌రిజిస్ట్రారు సిబ్బందిలో చర్చనీయాంశంగా మారింది. ధనం మూల ఇదం జగత్తు అన్న సామెతతో ముందుకువెళితే, అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చుననే భావనతో కార్యకలాపాలు చేపట్టేందుకు.. రైటర్లను ఒక తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం మాజీ వీఆర్వో సంబంధీకుడైన రైటర్ చేశారని రైటర్ల వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.


