పర్యాటక కేంద్రంగా గండికోట
● కలెక్టర్ శ్రీధర్
● అభివృద్ధి పనుల పరిశీలన
జమ్మలమడుగు : ప్రసిద్ధ గండికోటలో 79 కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా పర్యాటక చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని దేశం నలుదిక్కులా చాటేలా గండికోట ఉత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సాస్కి నిధుల ద్వారా గండికోట పర్యాటక కేంద్రాన్ని ప్రపంచ స్థాయిలో కీర్తిని ప్రతిబింభించేలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పర్యాటక మంత్రిత్వ శాఖా ఆధ్వర్యంలో గండికోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. అదేవిధంగా గండికోట కొట్లాలపల్లి, గండికోట రిజర్వాయర్ అందాలను వీక్షించడంతోపాటు, గండికోట గాడ్జ్ పాయింట్, ఓబెరాయ్ హోటల్‌నిర్మించే ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఆర్డీఓ సాయిశ్రీ, సుబ్రమణ్యం, మాదన్న, రాజారత్నం, సురేష్‌కుమార్, భాస్కర్‌రెడ్డి, గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
స్మార్టు కిచెన్ సెంటర్ తనిఖీ
జమ్మలమడుగు పట్టణంలోని పతంగే రామన్నరావు ఉన్నతపాఠశాలలో ఏర్పాటు చేసిన స్మార్టు కిచెన్ సెంటర్‌ను కలెక్టర్ శ్రీధర్ తనిఖీ చేశారు. ఇక్కడి స్మార్టు కిచెన్ సెంటర్‌నుంచి జమ్మలమడుగు, మైలవరం, పెద్దముడియం మండలాల ప్రాంతాల్లోని పాఠశాలలకు మధ్యాహ్న భోజనం సరఫరా అవుతుంది. దీంతో మధ్యాహ్న భోజనం పథకం ఎలా అమలవుతుందో తనిఖీ చేశారు. అలాగే దేవగుడి గ్రామంలో నిర్మాణంలో ఉన్న స్మార్టు కిచెన్ సెంటర్ పనులనూ పరిశీలించారు.


