
నిర్దేశిత లక్ష్యాల సాధనకు కృషి
కడప సెవెన్‌రోడ్స్: జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్‌లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ హాలులో స్వర్ణాంధ్ర విజన్– 2047లో భాగంగా నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ పై జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారులు,మండల అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర–2047 విజన్ సాకారానికి ప్రజా ప్రతినిధుల సహకారంతో అధికారులు ప్రో యాక్టివ్ గా పని చేయాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాల అంశాలను సాధించడానికి నియోజకవర్గ ప్రత్యేక అధికారులు శ్రద్ధ చూపాలన్నారు. ఇప్పటికే జిల్లాలో దాదాపు 78వేల బంగారు కుటుంబాలను గుర్తించామని నియోజకవర్గంలోని మండల వారీగా బంగారు కుటుంబాల మ్యాపింగ్ లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందన్నారు. జిల్లాలో గుర్తించిన బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకుని వాళ్ల ఉన్నతికి చర్యలు తీసుకోవాలన్నారు. రియల్ ఎస్టేట్ రంగం జిల్లాలో మరో ప్రధాన కీ రోల్ ప్లే చేస్తోందని మున్సిపల్ కమిషనర్లు అందరూ అనుమతులను సులభతరం చేసి రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇవ్వాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు వారంలో రెండు రోజులు రియల్టర్లతో ఓపెన్ ఫోరం సమావేశం నిర్వహించాలన్నారు. లేఔట్స్ బిల్డింగ్ నిర్మాణాల వంటి అనుమతుల్లో జాప్యం తగ్గించి త్వరితగతిన మంజూరు చేస్తే మున్సిపాలిటీలకు అధిక రాబడి వస్తుందని ఆ విధంగా మున్సిపాలిటీలు అభివద్ధి చెందుతాయన్నారు. జిల్లా ప్రధాన కేంద్రమైన కడప నియోజకవర్గంలో ఇండస్ట్రియల్, కన్స్‌ట్రక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి వృద్ధి సాధించాలన్నారు. రాయలసీమలోని కడప నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని అందుకు అనుగుణంగా ఎమర్జింగ్ ఏరియాలను గుర్తించి ఓపెన్ లేఔట్లు ట్రేడింగ్ లలో అనుమతులను సరళతరం చేయాలన్నారు. ముందుగా వ్యవసాయం, హార్టికల్చర్, మైక్రో ఇరిగేషన్, పశుసంవర్ధక, ఫిషరీస్ వంటి శాఖల్లో జిల్లా అధికారులు యాక్షన్ ప్లాన్ కనుగుణంగా లక్ష్యాల సాధనకు ఏ విధంగా కృషి చేస్తున్నారన్న అంశాలపై జిల్లా కలెక్టర్ రివ్యూ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీవో హాజరతయ్యా, కడప ఆర్డిఓ జాన్ ఇర్విన్, బద్వేలు ఆర్టీవో చంద్రమోహన్, జమ్మలమడుగు ఆర్డిఓ సాయి,కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి పాల్గొన్నారు.
సంతృప్త స్థాయిలో ప్రజాస్పందనలు
ప్రభుత్వ సేవలపై ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల నుంచి స్పందన సానుకూలంగా, సంతృప్త స్థాయి పెరిగేలా ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్ని శాఖల జిల్లా అధికారులకు సూచించారు. గురువారం అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో పలు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, జేసీ అదితిసింగ్ హాజరయ్యారు.