తెరపైకి నకిలీ పట్టాల వ్యవహారం | - | Sakshi
Sakshi News home page

తెరపైకి నకిలీ పట్టాల వ్యవహారం

Jul 4 2025 6:53 AM | Updated on Jul 4 2025 6:53 AM

తెరపైకి నకిలీ పట్టాల వ్యవహారం

తెరపైకి నకిలీ పట్టాల వ్యవహారం

బద్వేలు అర్బన్‌: వైఎస్సార్‌ కడప జిల్లాలోని బద్వేలు కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ పట్టాల వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది. తాజాగా ఓ మహిళ తన పేరిట ఉన్న ఇంటిపట్టాను ముగ్గురు వ్యక్తులకు అమ్మడం ద్వారా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో భాగంగా పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న వారిలో బద్వేలు నియోజకవర్గంలోని ఓ తహసీల్దారు కార్యాలయంలో పనిచేసే వీఆర్‌ఓ ఉన్నట్లు తెలిసింది. అనుమానితుల్లో కొందరి వద్ద నుండి నకిలీ పాసుపుస్తకాలు, సీళ్ళు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

మళ్ళీ తెరపైకి నకిలీ పట్టాల వ్యవహారం

సుమారు మూడేళ్ళ క్రితం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బద్వేలు నకిలీ పట్టాల వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది. బద్వేలు కేంద్రంగా ప్రభుత్వ స్థలాలకు, డీకేటీ పట్టాలకు కొంత మంది వ్యక్తులు అప్పటి రెవెన్యూ అధికారుల సహకారంతో భారీగా నకిలీ పట్టాలు సృష్టించి క్రయవిక్రయాలకు పాల్పడ్డారు. దీంతో బద్వేలులో ప్రతినిత్యం రెవెన్యూ, పోలీసు కార్యాలయాలకు స్థలాల సమస్యను బాధితులు తీసుకెళుతుండేవారు. ఈ క్రమంలో అప్పటి రెవెన్యూ డివిజనల్‌ అధికారి ఆకులవెంకటరమణ నకిలీ పట్టాలపై ప్రత్యేక దృష్టి సారించి కొందరు అనుమానితులను గుర్తించి వారిపై అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసి నకిలీ పట్టాల వ్యవహారాన్ని బహిర్గతం చేశారు. 2022 మేలో అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నెం. 112/22 కేసులో 19 మందిపైన, 118/22 కేసులో 7 మందిపైన కేసులు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తాజాగా పట్టణంలోని మార్తోమానగర్‌కు సమీపంలో 812 సర్వే నెంబర్‌లో తన పేరిట పట్టా ఉన్న ఓ మహిళ మొదట ఆ పట్టాను ఓ వ్యక్తి వద్ద కుదువకు ఉంచింది. తర్వాత అదే ప్లాట్‌ను నకిలీ పట్టాతో మరో వ్యక్తికి విక్రయించింది. అంతటితో ఆగక మరో నకిలీ పట్టాను పొంది మూడవ వ్యక్తికి సైతం స్థలాన్ని విక్రయించింది. విషయం తెలుసుకున్న బాధితులు అర్బన్‌ పోలీసులను ఆశ్రయించగా విచారించి సదరు మహిళతో పాటు అందుకు సహకరించిన వారిపై మూడు రోజుల క్రితం అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

పోలీసుల అదుపులో అనుమానితులు

నకిలీ పట్టాలు సృష్టించి ముగ్గురికి విక్రయించిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు మహిళకు నకిలీ పట్టాలు ఎవరు తయారు చేసి ఇచ్చారో తెలుసుకునేందుకు విచారణ వేగవంతం చేశారు. ఈ క్రమంలో గతంలో నకిలీ పట్టాల వ్యవహారంలో రిమాండ్‌లో ఉండి వచ్చిన పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలో గోపవరం మండలంలోని ఓ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి వద్ద, నియోజకవర్గంలోని ఓ తహసీల్దారు కార్యాలయంలో పనిచేసే వీఆర్‌ఓ వద్ద కొన్ని నకిలీ సీళ్ళు, నకిలీ పాసుపుస్తకాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అలాగే నకిలీ పట్టాల తయారీలో వీరి ప్రమేయం ఏమైనా ఉందా అన్న కోణంలో విచారిస్తున్నారు. అందులో భాగంగా గతంలో నమోదైన రెండు కేసుల్లో ఉన్న ఐదు మందిని, బద్వేలు రూరల్‌ పరిధిలోని నందిపల్లె సమీపంలో గల ఓ గ్రామానికి చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో భాగంగా బుధవారం మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్‌ సైతం అనుమానితులను విచారించినట్లు తెలిసింది.

అక్రమార్కుల గుండెల్లో గుబులు

పోలీసుల అదుపులో పలువురు అనుమానితులు?

అనుమానితుల్లో ఓ వీఆర్‌ఓ

నకిలీ పాసుపుస్తకాలు, సీళ్ళు స్వాధీనం

అక్రమార్కుల గుండెల్లో గుబులు

2022 మే నెలలో నకిలీ పట్టాల వ్యవహారం వెలుగు చూసిన తర్వాత బద్వేలు పరిసర ప్రాంతాల్లో నకిలీ పట్టాల తయారీ సద్దుమణిగింది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బద్వేలులో మళ్ళీ నకిలీ పట్టాల వ్యవహారం తెరపైకి వచ్చింది. విలువైన స్థలాలు ఉన్న ఎన్‌జీవో కాలనీ, నెల్లూరు రోడ్డు, మహమ్మద్‌కాలనీ, చెన్నంపల్లె తదితర ప్రాంతాలతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉన్న పబ్లిక్‌పర్పస్‌, రస్తా పోరంబోకు స్థలాలకు కొందరు అధికార పార్టీ నాయకులు నకిలీ పట్టాలు తయారు చేయించుకుని నిర్మాణాలు చేపట్టారు. అధికారం అండదండలతో ప్రశ్నించేవారు లేకపోవడంతో యదేచ్ఛగా తమ కార్యకలాపాలు కొనసాగించారు. అయితే ప్రస్తుతం నకిలీ పట్టాల వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చి కొందరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండటంతో ఎక్కడ తమ పేర్లు బయటపడతాయోనని ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement