
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
– మరొకరికి తీవ్ర గాయాలు
వేంపల్లె : వేంపల్లె మండల పరిధిలోని తాళ్ళపల్లె – ముసల్‌రెడ్డిపల్లె మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాసం గంగరాజు (45) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ముసల్‌రెడ్డిపల్లెకు చెందిన గంగరాజు బైకుపై వేంపల్లెకు వచ్చారు. పనులు ముగించుకుని మోటార్ బైకులో గురువారం రాత్రి వేంపల్లె నుంచి గంగరాజు, దుగ్గన్నగారిపల్లెకు చెందిన బుసిరెడ్డి శివానందరెడ్డిలు ముసల్‌రెడ్డిపల్లెకు వెళ్తూ గ్రామ సమీపంలోకి చేరుకున్నారు. అక్కడ వీరి మోటార్ బైకు, ట్రాక్టర్ ఢీకొన్నాయి. దీంతో అక్కడికక్కడే బాసం గంగరాజు మృతి చెందాడు. బుసిరెడ్డి శివానందరెడ్డికి తలకు తీవ్ర గాయం కావడంతో 108 వాహనం ద్వారా వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం కడప రిమ్స్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ నరసింహులు సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డు ప్రమాదంపై ఆరా తీశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి