
6 నుంచి డీఈఈ సెట్ కౌన్సెలింగ్
కడప ఎడ్యుకేషన్: డీఈఈ సెట్ ప్రవేశాలకు సంబంధించి విద్యార్థులకు ఈ నెల 6 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని డీఈఓ షేక్ షంషుద్దీన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6,7 తేదీల్లో మొదటి దశ కౌన్సెలింగ్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 8 నుంచి 12 వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్స్ ఎంచుకోవచ్చన్నారు. 13 నుంచి 16 వరకు సీట్ల కేటాయింపు, ప్రొవిజినల్ అడ్మిషన్ లెటర్ ఇవ్వడం జరుగుతుందన్నారు. 17 నుంచి 22 వరకు డైట్స్‌లో సర్టిఫికెట్ల పరిశీలన, చివరి అడ్మిషన్ లెటర్ ఇవ్వనున్నట్లు వివరించారు. పైన తెలిపిన షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించారు.
నేడు లోక్ అదాలత్
కడప అర్బన్: ‘జాతీయ లోక్ అదాలత్’ను వినియోగించుకుని సత్వర న్యాయం పొందాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్.బాబా ఫకృద్దీన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి వైఎస్‌ఆర్ జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టులలో శనివారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 24 బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. కడపలో 6, ప్రొద్దుటూరులో 3, రాజంపేటలో 3, రాయచోటిలో 3, బద్వేల్‌లో 3, లక్కిరెడ్డిపల్లి, రైల్వేకోడూరు, మైదుకూరు, జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం కోర్టులలో ఒక్కొక్క బెంచిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం ఫోన్ నంబర్స్: 08562 258622, 244622ను సంప్రదించాలని వివరించారు.
29న ఈశ్వరీదేవి
జయంత్యుత్సవం
బ్రహ్మంగారిమఠం: బ్రహ్మంగారిమఠంలో మాతా శ్రీ ఈశ్వరీదేవి 322వ జయంత్యుత్సవాలను ఈ నెల 29న నిర్వహిస్తున్నట్లు ఈశ్వరీదేవిమఠం ఈఓ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అమ్మవారి భక్తులు ముందుకు రావాలని ఆయన కోరారు. మఠాధిపతి శ్రీ వీరకుమారస్వామి ప్రత్యేక పూజలతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయన్నారు. అమ్మవారికి ప్రత్యేక ఉత్సవాల కోసం భక్తులు సెల్ నంబర్: 9490486064కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవాలని వివరించారు.
భారత్ స్కౌట్ అండ్
గైడ్స్ సెక్రటరీ తొలగింపు
కడప ఎడ్యుకేషన్: భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ సెక్రటరీగా పని చేస్తున్న ప్రమీలను ఆ పదవి నుంచి తొలగించినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. ఆమె స్థానంలో తాను జిల్లా కార్యదర్శిగా అదనపు బాధ్యతలు చేపట్టానన్నారు. గతంలో నిర్వహించిన సమావేశంలో కార్యదర్శిగా పని చేస్తున్న ప్రమీలపై సభ్యులంతా ఫిర్యాదు చేశారన్నారు. శుక్రవారం డీఈఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి ఆమె హాజరు కాకపోవడంతో సభ్యుల ఆమోదం మేరకు పదవి నుంచి తొలగించినట్లు తెలిపారు.
పంటల బీమా.. రైతుకు ధీమా
కడప సెవెన్‌రోడ్స్: బీమా పంటలకు రక్షణ కవచం లాంటిదని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తుఫాన్లు, కరువులు, అకాల వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు బీమా పరిహారం వస్తుందన్నారు. ఎంపిక చేసిన పంటలను సాగు చేస్తూ నిర్ణీత సమయంలో ప్రీమియం చెల్లించి నమోదు చేసుకున్న కౌలు రైతులకు సైతం బీమా అందుతుందన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు చంద్రానాయక్, రవిచంద్రబాబు, ఎల్‌డీఎం జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

6 నుంచి డీఈఈ సెట్ కౌన్సెలింగ్