
షేమ్.. షేమ్!
● అధికార దర్పానికి జీ హుజూర్ అంటున్న అధికారులు
● కమలాపురం ఎమ్మెల్యే ఇంటి ప్రాంగణంలో సమీక్షకు హాజరైన అధికారులు
● ప్రభుత్వ కార్యాలయాల్లో కాకపోయినా పరుగెత్తికెళ్లిన వైనం
● నియోజకవర్గ అభివృద్ధిపైఅధికారులతో సమాలోచనలు
● పుత్తా డైరెక్షన్‌లోకొనసాగిన సమావేశం
సాక్షి, టాస్క్‌ఫోర్స్: అధికార దర్పానికి సెల్యూట్ చేస్తున్న వారు కొందరైతే.. ‘నీ బాంఛన్ దొర’ అనే వారు మరికొందరయ్యారు. పోస్టింగ్స్ కోసం స్థాయిని దిగజార్చుకొని ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయంతో నిమిత్తం లేదు, ఎక్కడ సమీక్ష పెట్టినా మీరు ఆదేశిస్తే వచ్చి తీరుతామంటూ తలూపుతున్నారు. అధికార పార్టీ నేతలు ఆదేశించిందే శాసనం, చెప్పిందే వేదమని చెప్పకనే చెబుతున్నారు. ఈక్రమంలో మాచిరెడ్డిపల్లె చెట్ల కింద సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తే.. పరుగుపరుగునా అధికారులు వాలిపోయారు. ఈ దుస్థితికి వ్యవస్థలను దిగజార్చిన అధికారులు ‘షేమ్..షేమ్’ అని ప్రజాస్వామ్యవాదులు హేళన చేస్తున్నారు.
● కమలాపురం నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించేందుకు ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి సిద్ధమయ్యారు. ఆమేరకు శుక్రవారం మాచిరెడ్డిపల్లెకు రావాల్సిందిగా అధికారులకు కబురు పంపారు. జిల్లా కేంద్రంలో ఉన్నతాధికారుల సమక్షంలో సమీక్ష చేపట్టే అవకాశం ఉంది. అలా కాదు, కూడదంటే.. నియోజకవర్గ కేంద్రమైన కమలాపురంలో కూడా చేపట్టవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలతో నిమిత్తం లేకుండా ఎమ్మెల్యే పుత్తా ఇంటి ప్రాంగణంలో సమీక్ష నిర్వహించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించే వారు, ఇలాంటి చర్యలకు ఉపక్రమించరని పలువురు దెప్పి పొడుస్తున్నారు. మాచిరెడ్డిపల్లెలో చెట్ల కింద సమీక్ష నిర్వహించడం ఏమిటని అభ్యంతరం చెబుతున్నారు.
ప్రగతి పేరిట పెత్తనం
కమలాపురం ఎమ్మెల్యేగా పుత్తా కృష్ణచైతన్యరెడ్డి అభివృద్ధిపై సమీక్ష చేపట్టడం సముచితమే. కాకపోతే ఇంటి ప్రాంగణంలో సమీక్ష నిర్వహించడమే తీవ్ర అభ్యంతరకరమని పలువురు వివరిస్తున్నారు. అదే సమీక్ష ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించి.. ఇతర ప్రజా ప్రతినిధులను కూడా ఆహ్వానించించి వారి సలహాలు, సూచనలు తీసుకొని ఉంటే హుందాతనం లభించేది. అలా కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థపై గౌరవం లేకపోగా తాను చెప్పిందే వేదమన్నట్లుగా.. రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డితో సమీక్ష చేయించడాన్ని పలువురు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఎలాంటి అధికారిక హోదా లేకపోయినా.. పుత్తా నరసింహారెడ్డి ఆర్డీఓ జాన్‌ఎర్వీన్‌తో సమానంగా కూర్చొని అధికారులను ప్రశ్నించారని విపక్ష పార్టీ నేతలు నిలదీస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు అనుగుణంగా అధికారులు వ్యవహరించకపోవడం, మాచిరెడ్డిపల్లెలో సమీక్షకు వెళ్లడంపై సర్వోన్నతాధికారి అభ్యంతరం చెప్పకపోవడంపై విశ్లేషకులు హేళన చేస్తుండటం గమనార్హం.

షేమ్.. షేమ్!