
పాఠశాలల్లో సమాంతర మీడియం కొనసాగించాలి
మదనపల్లె సిటీ : పిల్లలకు స్వేచ్ఛనిచ్చి ఇష్టం వచ్చిన మీడియంను ఎంచుకునే విధంగా పాఠశాలల్లో తెలుగు మీడియంను ఇంగ్లీషు మీడియంకు సమాంతరంగా పునః ప్రారంభించడం లేదా కొనసాగించడం చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ప్రతి ప్రాథమిక పాఠశాలకు విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 45 దాటితే రెండవ సెక్షన్‌కు అనుమతించాలన్నారు. ఈనెల 21వతేదీన పాత జిల్లా కేంద్రంలో జరగబోయే డీఈఓ కార్యాలయ ముట్టడి కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా కార్యదర్శులు పురం రమణ, ఆదినారాయణ, నాయకులు విజయకుమార్, సుధాకర్, రవిప్రకాష్, మురళి, అజంతుల్లా తదితరులు పాల్గొన్నారు.