
గుర్తు తెలియని వృద్ధురాలి మృతి
చాపాడు : మండల పరిధిలోని అల్లాడుపల్లె వీరభద్రస్వామి దేవస్థానం వద్ద గల సత్రంలో ఆదివారం ఉదయం గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందింది. మైదుకూరు వైపు వెళ్లే దారిలో గల సత్రంలో వృద్ధురాలు మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఆమె గురించిన వివరాలు తెలియకపోవడంతో పంచాయతీ అధికారులకు అ ప్పగించి అంత్యక్రియలు నిర్వహించినట్లు స్థానికులు తెలిపారు. నాలుగు రోజుల నుంచి ఈమె ఇక్కడ ఉందని కొందరు వ్యక్తులు వదిలేసి వెళ్లారని స్థానికులు చర్చించుకుంటున్నారు.
ఎస్పీ, డీఎస్పీని కలిసిన వార్డు మెంబర్లు
ప్రొద్దుటూరు : హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని కోరుతూ గోపవరం గ్రామ పంచాయతీకి చెందిన 13 మంది వైఎస్సార్‌సీపీ వార్డు సభ్యులు ఆదివారం జిల్లా ఎస్పీ, ప్రొద్దుటూరు డీఎస్పీని కలిశారు. ఈ మేరకు కోర్టు ఉత్తర్వుల ప్రతులను ఆయా కార్యాలయాల్లో అందజేశారు. గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక సోమవారం ఉదయం జరగనుంది. గతంలో అరాచకాలకు, విధ్వంసాలకు పాల్పడిన టీడీపీ నేతల కారణంగా ఉప సర్పంచ్ ఎన్నిక వాయిదా పడింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ వార్డు సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించి ఉప సర్పంచ్ ఎన్నికను ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిపేందుకు ప్రత్యేకంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఎన్నిక ప్రక్రియను సీసీ కెమెరాల ద్వారా రికార్డు చేయాలని హైకోర్టును కోరారు. సర్పంచ్ గద్దా మోషాతోపాటు ఉప సర్పంచ్ అభ్యర్థి బీరం రాఘవేంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ వార్డు సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
నలుగురికి గాయాలు
మదనపల్లె సిటీ : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడిన సంఘటన ఆదివారం కురబలకోట మండలం చేనేతనగర్ వద్ద జరిగింది. తెట్టు గ్రామానికి చెందిన అఖిల్(21), విష్ణు(20) ద్విచక్ర వాహనంలో మదనపల్లె వైపు వస్తుండగా మదనపల్లె నుంచి ఆర్‌సి కురపల్లికి చెందిన రామమూర్తి(65) మరో ద్విచక్రవాహనంలో వెళుతుండగా వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాల్లోని వారు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం స్థానికులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. అలాగే అంగళ్లు విశ్వం కాలేజీ వద్ద గొళ్లపల్లె పంచాయతీ చీకిచెట్టిపల్లెకు చెందిన మౌలా కుమారుడు రోషన్‌జమీర్(19) ద్విచక్రవాహనంలో వెళుతుండగా ఎదురుగా వచ్చిన టాటా ఏస్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన రోషన్ జమీర్‌ను స్థానికులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ఈ సంఘటనలపై ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేశారు.