
21న డీఈఓ కార్యాలయం ముట్టడి
మైదుకూరు : తొమ్మిది రకాల పాఠశాలల విధానాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 21వ తేదీన అన్ని జిల్లాల్లో డీఈఓ కార్యాలయాలను ముట్టడిస్తున్నట్టు ఐక్య ఉపాధ్యాయ సంఘం (యూటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజా తెలిపారు. మైదుకూరులో ఆదివారం యూటీఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 9 రకాల బడుల విధానం తీసుకొచ్చి పాఠశాలలను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. వేలాది పాఠశాలల మూసివేత, వేలాది ఉపాధ్యాయుల మిగులు దిశగా ఆ విధానం ఉందన్నారు. దానిని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. మోడల్, ప్రైమరీ పాఠశాలల పేరుతో 2 కిలోమీటర్ల నుండి 7 కిలోమీటర్ల వరకు పాఠశాలలను కలపడం వల్ల చిన్న పిల్లలు ముఖ్యంగా బాలికలు బడికి దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల విద్యను కార్పొరేటీకరణ చేయడంలో భాగంగానే 19, 20, 21 జీఓలను విడుదల చేసిందని విమర్శించారు. ఇంగ్లీషు మీడియానికి తెలుగు మీడియంను సమాంతరంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్‌బాబు, జిల్లా సహాధ్యక్షుడు వై.రవికుమార్, జిల్లా కార్యదర్శి అజాజ్ అహ్మద్, సంఘం మండల నాయకులు ఎన్.గంగులయ్య, ఎం.గురివిరెడ్డి, టి.వెంకట రమణారెడ్డి, శ్రీనివాసులు, ఎన్.తిరుపాలయ్య, రామ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.