
కడప నగరంలో తిరంగా ర్యాలీ
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్‌కు గట్టిగా గుణపాఠం చెప్పిన భారత త్రివిధ దళాలు, ప్రధాని నరేంద్రమోదీకి సంఘీభావంగా శనివారం కడప నగరంలో తిరంగా ర్యాలీ నిర్వహిచారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రతి పౌరుడు జాతీయ భద్రతకు అండగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ వంగల శశిభూషణ్‌రెడ్డి, బీజేపీ పార్లమెంటు కన్వీనర్ బొమ్మన సుబ్బరాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ జమ్మలమడుగు ఇన్‌చార్జి చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ రామరాజు, జనసేన జిల్లా కో ఆర్డినేటర్ సుంకర శ్రీనివాస్, కూటమి నేతలు పాల్గొన్నారు.
షోకాజ్ నోటీసులు
అందుకున్న తహసీల్దార్
లింగాల : లింగాల మండల తహసీల్దార్‌గా 2022 నుంచి 2024 వరకు పనిచేసిన లక్ష్మీనారాయణ షోకాజ్ నోటీసులు అందుకున్నారు. 20 ఏళ్ల కాల పరిమితితో అసైన్డ్ భూములపై రైతులకు యాజమాన్య హక్కు కల్పిస్తూ చట్ట సవరణ చేసిన విషయం తెలిసిందే. అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేయడంలో 2003 సంవత్సరానికి ముందు ఉన్న భూములను చేయాల్సి ఉంది. అయితే లక్ష్మీనారాయణ 2024–25 సంవత్సర భూములను కూడా ఫ్రీ హోల్డ్ చేశారని విచారణలో తేలింది. మండలంలోని లోపట్నూతల, లింగాల, కామసముద్రం గ్రామాల్లోని 76 ఎకరాల అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేయడంపై జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ప్రస్తుత తహసీల్దార్ ఈశ్వరయ్య తెలిపారు.
సత్యదేవుని దర్శనానికి వచ్చి గుండెపోటుతో మృతి
అన్నవరం : కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో సత్యదేవుని దర్శనానికి వచ్చిన వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వెంకట రమణ అనే భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం వెంకట రమణ స్వామివారి దర్శనం అనంతరం శుక్రవారం మధ్యాహ్నం దేవస్థానం ప్రాంగణంలో గుండెనొప్పితో పడిపోయాడు. దేవస్థానం ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం 108లో తుని ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మృతుని బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు రమణ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించారు.
కియా కారెన్స్
క్లానిస్ కారు ఆవిష్కరణ
కడప కోటిరెడ్డిసర్కిల్ : కియా సంస్థకు చెందిన కియా కారెన్స్ క్లానిస్ కారును కడప హోషి ఆటో ప్రైవేట్ లిమిటెడ్ షోరూం ఎండీ జగన్నాథరెడ్డి డైరెక్టర్లు చెరకు నిరంజన్, సి.భారతి, హోషిమారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్నాథరెడ్డి మాట్లాడుతూ కియా సంస్థ విడుదల చేసిన నూతన వాహనంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. ప్రజలు తమ షోరూంను సందర్శించి వాహనాన్ని పరిశీలించడంతోపాటు బుక్ చేసుకోవచ్చన్నారు. వినియోగదారులు 9100773485 నంబరులో సంప్రదించాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో షోరూం ప్రతినిధులు, సిబ్బంది, కొనుగోలుదారులు పాల్గొన్నారు.
పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై
దృష్టి సారించాలి
– జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్
కడప అర్బన్ : పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. శనివారం నగరంలోని జిల్లా పోలీస్ సంక్షేమ ఆస్పత్రిలో రూ. 4.5 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక సెల్ కౌంట్ అనలైజర్ మిషన్ ( కంప్లీట్ బ్లడ్ పిక్చర్ మిషన్) ను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మిషన్ పనితీరును యూనిట్ డాక్టర్ మేరీ సుజాతను అడిగి తెలుసుకున్నారు. ఖరీదైన రక్త పరీక్షలను పోలీస్ సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు అందుబాటులోకి తేవడం పట్ల పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్ హర్షం వ్యక్తం చేశారు.
మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదాం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మూడవ శనివారం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాన్ని శనివారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని పోలీస్ సంక్షేమ ఆస్పత్రి ఆవరణలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మొక్కను నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించడం సామాజిక బాధ్యతగా భావించి అందరూ సమష్టిగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ(పరిపాలన) కె.ప్రకాష్ బాబు, ఆర్.ఐ లు టైటస్, వీరేష్, శ్రీశైల రెడ్డి, ఆర్.ఎస్.ఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

కడప నగరంలో తిరంగా ర్యాలీ

కడప నగరంలో తిరంగా ర్యాలీ