
రోడ్డు ప్రమాదంలో అవ్వ, మనవడు దుర్మరణం
కలసపాడు : మండలంలోని సింగరాయపల్లె గ్రామానికి చెందిన యంబడి సౌరమ్మ (45), తలారి జశ్వంత్ (15) కలసపాడు సమీపంలోని ఐటీఐ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు సౌరమ్మ, ఆమె మనుమడు జశ్వంత్ సింగరాయపల్లెలో మూడు రోజులు జరిగే తిరునాలకు సరుకులు తీసుకువచ్చేందుకు కలసపాడుకు వెళ్లారు. సరుకులు తీసుకుని స్వగ్రామానికి వస్తుండగా కలసపాడు సమీపంలోని ఐటీఐ వద్ద చెన్నుపల్లె నుంచి గొర్రెల లోడుతో వస్తున్న బొలెరో వాహనం ఢీకొంది. సౌరమ్మ అక్కడికక్కడే మృతిచెందగా జశ్వంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు జశ్వంత్‌ను కలసపాడులోని ఓ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. మృతదేహాలను పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
గుర్తుతెలియని వృద్ధుడి మృతి
పులివెందుల రూరల్ : పట్టణంలోని స్థానిక వైఎస్సార్ సర్కిల్ సమీపంలోని వెంకటేశ్వర వైన్స్ ముందు శనివారం సాయంత్రం గుర్తు తెలియని వృద్ధుడు(70) మృతి చెందాడు. ఇతను గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో యాచన చేస్తూ తిరుగుతుండేవాడు. మద్యం కోసం వైన్ షాపు వద్దకు వెళ్లి మద్యం తీసుకొని వర్షం వస్తుండడంతో అక్కడే నిలబడ్డాడు. ఉన్నట్లుండి కుప్పకూలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో అవ్వ, మనవడు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో అవ్వ, మనవడు దుర్మరణం