
సిమెంటు రోడ్డుకు అడ్డంగా గోడ
కడప కార్పొరేషన్ : కడప నగరంలో టీడీపీ నేతల అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అధికారముంది కదా అని ఏమైనా చేయొచ్చు... ఏ స్థలమైనా కబ్జా చేసి స్వాధీనం చేసుకోవచ్చని భావిస్తున్నారు. చిన్నచౌకులోని మద్రాసు రోడ్డులో టయోటా షోరూం పక్కనున్న జయమ్మ కాలనీలో నిర్మించిన సిమెంటు రోడ్డుకు అడ్డంగా కమలాపురానికి చెందిన టీడీపీ నేత రాజగోపాల్‌రెడ్డి గోడ నిర్మించారు. రోడ్డు నిర్మించిన స్థలంలో 0.11 సెంట్లు తనదే అని చెబుతూ శనివారం ఉదయం సుమారు 100 మంది అనుచరులతో వెళ్లి దౌర్జన్యంగా సిమెంటు రోడ్డుకు అడ్డంగా గోడ కట్టించినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి మేయర్‌గా ఉన్న సమయంలో 2007లో ఈ సిమెంటు రోడ్డును నిర్మించారు. అంటే సుమారు 18 ఏళ్లక్రితం నగరపాలక సంస్థ నిర్మించిన సీసీ రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడి ప్రజలు రాకపోకలు సాగించాలంటే ఇదొక్కటే రహదారిగా ఉంది. దీన్ని కూడా ఇప్పుడు గోడకట్టి మూసివేయడంతో తాము ఎలా రాకపోకలు సాగించాలని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై వారు నగరపాలక సంస్థ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
టీడీపీ నేతల దౌర్జన్యం
నగరపాలక అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు