
నేరాల నియంత్రణలో కొరవడిన నిఘా
కడప అర్బన్ : వైఎస్‌ఆర్ కడప జిల్లాలో రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. వాటిని కట్టడి చేసేందుకు జిల్లా ఎస్పీతో పాటు, పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. కానీ దొంగతనాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నా యి. కొందరు పోలీసు అధికారుల అవినీతి చర్యలతో నేరాల నియంత్రణపై నిఘా కొరవడిందని చెప్పవ చ్చు. పోలీసుశాఖ ఉన్నతాధికారులు మాత్రం ‘ఫ్రెండ్లీ పోలీస్’గా ఉండాలని విధించిన నిబంధనలు పోలీసు అధికారుల కాళ్లకు బంధనాలు వేసినట్లుగా భావించాల్సి వస్తోంది. దీనికి తోడు జిల్లా పోలీసు శాఖలో పోలీసు అధికారులు, సిబ్బంది కొరత వేధిస్తోంది.
● కడప నగరంలోని తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 15వ తేదీన రాత్రి సమయంలో బిల్టప్ వద్ద పులివెందుల రహదారిలో వున్న వైన్‌షాపు ముందు రాయప్ప అనే వ్యక్తి సాదిక్‌వలీ అనే వ్యక్తిని కత్తితో దారుణంగా గొంతుకోసి హత్య చేశాడు. అలాగే ఈనెల 11వ తేదీన రాత్రి సమయంలో వరుణ్‌తేజ్ అనే యువకుడిని ఆంజనేయులు, అతని కుమారుడు జ్ఞానేశ్వర్‌లు కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డారు. కడప– పులివెందుల రహదారిలో బిల్టప్ వద్ద ఓ బార్, రెండు వైన్‌షాపులు, అనధికారిక పర్మిట్‌రూమ్‌లు ఉన్నాయి. బిల్టప్ సర్కిల్ ఇలాంటి నేరాలకు అడ్డాగా మారి సమస్యాత్మక ప్రదేశంగా తయారైంది.
● కడప నగరంతో పాటు జిల్లాలోని ప్రొద్దుటూరు, ఇ తర ప్రాంతాలలో ఇళ్లలో దొంగతనాలు ఇటీవలి కా లంలో జరిగాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులను నమోదు చేయకుండా వారికి నచ్చినట్లు, ఇష్టం వచ్చినట్లు వారికి ఇబ్బంది రాకుండా ఉండేలా తక్కువ మొత్తంలో బంగారు ఆభరణా లు, డబ్బులు పోయినట్లుగా ఫిర్యాదులను స్వీకరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
● గత ఏడాదిలో కడప నగరంతో పాటు, ఒంటిమిట్ట ప్రాంతాలలో జరిగిన ఎస్‌బీఐ ఏటీఎం మిషన్‌ల చోరీ కేసును ఇప్పటివరకు పోలీసులు నిగ్గు తేల్చలేకపోయారు.
● జిల్లాలో సైబర్ నేరాల బారినపడి తమ బ్యాంకు ఖాతాలలోని లక్షలాది రూపాయలను పోగొట్టుకుని బాధితులు కడపలోని సైబర్ నేరాల నియంత్రణ పోలీసు విభాగానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే దాదాపు 8 నుంచి 10 కోట్ల రూపాయలను ఏడాది కాలంలోనే పోగొట్టుకున్న బాధితులకు సాంకేతిక, ప్రాక్టికల్ సమస్యలతో రికవరీ చేయలేకపోతున్నారు.
● జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ వాహనదారులను ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని తనిఖీలు, అవగాహన కల్పిస్తున్నప్పటికీ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వాహనదారుల మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనాలను నిర్లక్ష్యంగా నడపడంలాంటి చర్యలతో ప్రమాదాలను నిలువరించలేకపోతున్నారు.
● పోలీసుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ‘పోలీస్ కో–ఆపరేటివ్ మ్యూచువల్ సొసైటీ’లో సభ్యుల డబ్బులను గోల్‌మాల్ చేసి రూ.కోటి 20 లక్షల మేరకు అవినీతికి పాల్పడిన ఉద్యోగిపై విచారణ అటకెక్కిందనే విమర్శలు వస్తున్నాయి. సభ్యులు తమ సభ్యత్వం డబ్బులను ఎప్పుడు పోలీసు ఉన్నతాధికారులు ఇప్పిస్తారా? అని ఎదురు చూస్తున్నారు.
● నేరాల నియంత్రణకు కడప నగరంలో 250, ప్రొద్దుటూరు పట్టణంలో 220 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. పోలీసు అధికారుల ప్రయత్నాలకు కూటమి ప్రభుత్వం సహకరిస్తేనే సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని ప్రజలు పేర్కొంటున్నారు.
● జిల్లా పోలీసు శాఖలోని ఏఆర్ విభాగంలో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న సిద్దారెడ్డిని అవినీతి ఆరోపణలపై, యువతి ఆత్మహత్యకు కారణమైన రామ్మోహన్‌రెడ్డిని జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. ఇలాంటి సంఘటనలపై పోలీసు అధికారులు ప్రత్యేక నిఘా వుంచి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
● ప్రతి సోమవారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో బాధితులు చేసే ఫిర్యాదులలో ఎక్కువగా భూములు, స్థలాల ఆక్రమణలు, డబ్బుల బాకీ వ్యవహాలే వస్తున్నాయి. ఇటీవల జిల్లాలో షేర్ మార్కెట్, క్విడ్‌ప్రోకో పేరుతో కడప నగరానికి చెందిన ఓ వ్యక్తి దాదాపుగా 12 నుంచి 20 కోట్ల రూపాయలు కాజేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
రోజురోజుకు పెరుగుతున్న
వివిధ రకాల నేరాలు
చోరీలలో ఫిర్యాదుదారులచేత తక్కువగా పోగొట్టుకున్నట్లు కేసుల నమోదు
జిల్లాలో సీసీ కెమెరాల పనితీరులో లోపం
పోలీసు కో–ఆపరేటివ్ సొసైటీలో గోల్‌మాల్‌పై చర్యలు నిల్
పోలీసుశాఖలో కొందరు అధికారులు, సిబ్బంది పనితీరు అవినీతిమయం
సైబర్ నేరాలలో కోట్లాది రూపాయలను పోగొట్టుకుంటున్న బాధితులు
నేడు కడపలో పర్యటించనున్న రాష్ట్ర హోంశాఖామంత్రి వంగలపూడి అనిత
నేడు జిల్లాకు హోంమంత్రి రాక ...
టీడీపీ మహానాడు కార్యక్రమం కడప నగర శివార్లలోని పబ్బాపురం వద్ద ఈనెల 27, 28, 29 తేదీలలో నిర్వహించనున్న నేపథ్యంలో ఇప్పటికే పలువురు మంత్రులు విచ్చేసి పరిశీలించి వెళ్లారు. ఈక్రమంలోనే రాష్ట్ర హోంశాఖా మంత్రి వంగలపూడి అనిత ఆదివారం కడపకు విచ్చేసి మహానాడు ప్రాంగణాన్ని అధికారులతో కలసి పరిశీలించనున్నారు. జిల్లాలో నేరాల నియంత్రణకు సంబంధించి ఆమె పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేస్తారేమోననే ఆశతో ప్రజలు ఎదురు చూస్తున్నారు.