
ఉపాధి పనుల్లో అవకతవకలకు పాల్పడితే చర్యలు
వేంపల్లె: జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. జిల్లాలో జరుగుతున్న ఉపాధి పనుల్లో అవినీతి జరుగుతోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఇటీవల జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం వేంపల్లె పంచాయతీ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీ సమీపంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. అలాగే కూలీలతో మాట్లాడి.. పనులు, సౌకర్యాలు, బిల్లుల చెల్లింపుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం కింద ఉద్యానవన పంటలను సాగు చేసిన నిమ్మ, చీనీ పంటలను పరిశీలించి.. రైతుల ద్వారా బిల్లుల చెల్లింపులు, ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి కూలీలు డీకేటీ భూములను సాగు చేసుకుంటుంటే అలాంటి వారికి పట్టాలు ఇస్తామని కలెక్టర్ చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఉపాధి పనులను తనిఖీలు చేపట్టడం జరుగుతుందన్నారు. కలెక్టర్ వెంట పులివెందుల ఆర్డీవో చిన్నయ్య, తహసీల్దార్ హరినాథ్‌రెడ్డి, ఎంపీడీఓ కుళాయమ్మ, ఉపాధి ఏపీఓ పార్వతి, ఉపాధి హామీ పథక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యనందించండి
ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో చదివే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. మండలంలోని ఇడుపులపాయ పంచాయతీలో ఉన్న ఆర్జీయూకేటీ పరిధిలోని ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీని ఆయన తనిఖీ చేశారు. అనంతరం ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తాతో కలిసి ఆయా శాఖల అధికారులతో అడ్మినిస్ట్రేషన్‌పై సమావేశం నిర్వహించారు. ఫ్యాకల్టీ, సిబ్బంది తదితర అంశాలపై ఆరా తీశారు. పాలనపరంగా ఉన్న సమస్యలను తమ దృష్టికి తేవాలని డైరెక్టర్‌కు కలెక్టర్ సూచించారు. పరిశ్రమలకు అనుగుణంగా ట్రిపుల్ ఐటీలో కొత్త ల్యాబ్‌లను అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ట్రిపుల్ ఐటీ అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి