
రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపు పాలన
వల్లూరు: రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపు పాలన జరుగు తోందని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పీ రవీంద్రనాథరెడ్డి విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా.. తప్పుడు సంప్రదాయాలకు తెరతీస్తోందని మండిపడ్డారు. కడపలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు చేస్తున్న కక్ష రాజకీయాల వల్ల రాష్ట్రంలో వ్యవస్థలు దెబ్బతింటున్నాయని అన్నారు. మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్, ఇతర అధికారులపై సైతం తప్పుడు కేసులు పెట్టి సాక్షాలు, వాంగ్మూలాలు సృష్టించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ ప్రభుత్వాధికారి కృష్ణమోహన్‌న్‌రెడ్డిల అరెస్టులను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు రాష్ట్రానికి చేటుగా మారుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వాధికారులు, మాజీ ప్రభుత్వాధికారులపై కూడా రాజకీయ విరోధం చూపించడం తగదన్నారు. చంద్రబాబు తీసుకొచ్చిన తప్పుడు సంప్రదాయాలు రాష్ట్రానికి చేటు చేస్తున్నాయన్నారు. లిక్కర్ వ్యవహారంలో ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలు చూపలేదని.. కానీ బెదిరించి, భయపెట్టి తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని, అరెస్టులు మాత్రం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కల్తీ జరుగుతోందని ఆరోపించిన టీడీపీ.. ఇప్పుడు అధికారంలో వుండి అవే డిస్టలరీల నుంచి కొనుగోలు చేస్తుండటం ఆ పార్టీ మోసపూరిత విధానాలకు నిదర్శనమన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఖజానాకు నష్టం వచ్చిందన్న టీడీపీ.. నేడు అధికారంలో వుండి ప్రభుత్వమే విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నా ఆదాయాలు ఎందుకు పెరగడం లేదో చెప్పాలని ప్రశ్నించారు.
వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు
పి.రవీంద్రనాథరెడ్డి