
‘లోక్ అదాలత్’ సేవలు సద్వినియోగం చేసుకోండి
కడప అర్బన్ : జిల్లాలోని ప్రజలు శాశ్వత లోక్ అదాలత్, పబ్లిక్ యుటిలిటీ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కడప శాశ్వత లోక్ అదాలత్, పబ్లిక్ యుటిలిటీ సేవల చైర్మన్ స్వర్ణ ప్రసాద్ తెలిపారు. శనివారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి, జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్.బాబా ఫకృద్దీన్ ఆధ్వర్యంలో కడపలోని జిల్లా కోర్టు ఆవరణలో ‘పారా లీగల్ వలంటీర్‌లు, పర్మినెంట్ లోక్ అదాలత్ ఉద్యోగులకు శాశ్వత లోక్ అదాలత్, పబ్లిక్ యుటిలిటీ సేవలు, సామర్థ్యం, పెంపుదల, శిక్షణ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ మాట్లాడుతూ ఈ లోక్ అదాలత్‌లు సంబంధిత జిల్లా ప్రధాన కార్యాలయంలో న్యాయసేవాసదన్ భవన సముదాయాలలో పని చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కాలిపోయిన కారు..
తప్పిన ప్రమాదం
ప్రొద్దుటూరు క్రైం: మండలంలోని తాళ్లమాపురం గ్రామ సమీపంలో కారు దగ్ధమైంది. తాళమాపురం గ్రామానికి చెందిన నాగార్జున శనివారం ఉదయం కారులో పొద్దుటూరుకు వెళ్లాడు. పని ముగించుకుని రాత్రి పొద్దుటూరు నుంచి కారులో తాళ్లమాపురం గ్రామానికి బయలుదేరాడు. గ్రామ సమీపంలోకి రాగానే కారులోని ఏసీ లోంచి పొగలు వచ్చాయి. అప్రమత్తమైన నాగార్జున వెంటనే కారును ఆపి దిగిపోయాడు. అతను కారు దిగి పక్కకు వెళ్లిన క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో కారు పూర్తిగా కాలిపోయింది. నాగార్జున అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేశారు.