బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

Mar 30 2023 1:12 AM | Updated on Mar 30 2023 1:12 AM

పుష్పాలంకరణలో ఆలయ రంగమండ పం - Sakshi

పుష్పాలంకరణలో ఆలయ రంగమండ పం

నేడు, రేపు కవిసమ్మేళనం

ఒంటిమిట్ట: శ్రీరామనవమి, పోతన జయంతిని పురస్కరించుకుని టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 30, 31 తేదీల్లో కవి సమ్మేళనం జరుగుతుందని టీటీడీ పీఆర్‌ఓ రవి ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రొఫెసర్‌ జి. ఎస్‌. ఆర్‌ కృష్ణమూర్తి అధ్యక్షతన పోతన భాగవతంపై జరిగే కవి సమ్మేళనంలో ఎం. నారాయణరెడ్డి, డాక్టర్‌ బి. గోపాలకృష్ణ శాస్త్రి, డాక్టర్‌ కె. సుమన, పి. శంకర్‌, వి. చిన్నయ్య, ఎం. లోకనాథం పాల్గొంటారన్నారు. 31న టీటీడీ అర్చక శిక్షణ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ హేమంత్‌ కుమార్‌ అధ్యక్షతన శ్రీరామ పాదుకాపట్టాభిషేకంపై జరిగే కవి సమ్మేళనంలో ఎల్‌. జగన్నాథశాస్త్రి, ఎం. మల్లికార్జునరెడ్డి, వై. మధుసూదన్‌, సి. శివారెడ్డి, యు, భరత్‌ శర్మ, పి. నీలవేణి పాల్గొంటారు.

ఒంటిమిట్ట: ఒంటిమిట్టలో గురువారం నుంచి ప్రారంభం కానున్న కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాముడి సన్నిధిలో చలువ పందిళ్లు వేశారు. యాగశాలను నిర్మించారు. సర్వదర్శనం, అన్నప్రసాదం, వాహనాలు నిలుపు స్థలం, వైద్య శిబిరం, సమాచార కేంద్రాల కోసం ప్రత్యేకంగా జర్మనీ తరహా షెడ్లను ఏర్పాటు చేశారు.

కల్యాణ వేదిక ముస్తాబు

వచ్చే నెల 5న జరగనున్న సీతారాముల పరిణయ ఘట్టానికి కల్యాణ వేదికను ముస్తాబు చేస్తున్నారు. ఈ ప్రాంగణంలో 8వ సారి రామయ్య పెళ్లి జరగనుంది. భక్తులందరికి ముత్యాల తలంబ్రాల పొట్లాలు పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. అలాగే వచ్చే భక్తులకు దాదాపు 6 లక్షల తాగునీరు ప్యాకెట్లు, సుమారు 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, కల్యాణానికి వచ్చే ప్రతి భక్తుడికి అన్నప్రసాదం అందేలా కౌంటర్లను అందుబాటులో ఉంచనున్నారు. కాగా శ్రీ రామనవమిని పురస్కరించుకుని ప్రభుత్వం తరపున రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సతీ సమేతంగా స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement