రాజంపేట : విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఏఐటీఎస్ అధినేత చొప్పా గంగిరెడ్డి అన్నారు. స్థానిక ఏఐటీఎస్‌లో నాలుగో సంవత్సరం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విద్యార్థుల వీడ్కోలు సభ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగేళ్లపాటు చదివిన చదువుకు ఫలితం ఉద్యోగం సాధించడం మాత్రమేకాదని, ఉన్నతమైన ఆశయాలతో సమాజానికి, దేశానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వడం కూడా అన్నారు. వైస్‌చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి మాట్లాడుతూ ఎంత ఎత్తుకు ఎదిగినా తల్లిదండ్రులను, సమాజాన్ని, దేశాన్ని మరిచిపోరాదన్నారు. ప్రిన్సిపాల్ నారాయణ మాట్లాడుతూ కృషి, పట్టుదలతో దేనినైనా సాధించగలరన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో హెచ్‌వోడీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
లారీ ఢీకొని
యువకుడి దుర్మరణం
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు పట్టణంలోని రాజ్‌రెసిడెన్సీ వద్ద మంగళవారం రాత్రి లారీ ఢీకొని బాలగోవర్దన్ (32) అనే యువకుడు దుర్మరణం చెందాడు. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని చియ్యవరానికి చెందిన రాజారావు కుమారుడు బాలగోవర్దన్ కొన్ని నెలలుగా పట్టణంలోని ఉంగరాల నగర్‌లో నివాసం ఉంటున్నాడు. రాజ్‌రెసిడెన్సీ దారి నుంచి నడిచి వెళుతుండగా కడప నుంచి తిరుపతికి వెళ్తున్న సిమెంట్ రవాణా లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు సంఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.