
నేతన్నకు రుణ విముక్తి
భూదాన్‌పోచంపల్లి : బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న చేనేత కార్మికులకు ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకొంది. చేనేత కార్మికులను రుణ విముక్తులను చేస్తూ మంగళవారం రుణమాఫీ పథకం కింద 2025–26 బడ్జెట్ నుంచి రూ.33 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్ అపెరల్ ఎక్స్‌పోర్ట్ పార్‌ుక్స కమిషనర్‌కు ఈ నిధులను విడుదల చేసి లబ్ధిదారులైన నేతన్నలకు చెల్లించేందుకు పూర్తి అధికారం ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయంతో చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఇలా..
రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1, 2017 నుంచి 31 మార్చి 2024 వరకు చేనేత కార్మికులు తీసుకొన్న రుణాలకే మాఫీ వర్తింపజేస్తూ ఉత్తర్వులిచ్చింది. ముఖ్యంగా వృత్తిపై తీసుకొన్న రుణాలు, చేనేత వస్త్రాల ఉత్పత్తికి, వృత్తి సంబంధ కార్యకలాపాలు, వ్యక్తిగత, ముద్ర రుణాలన్నింటి మాఫీ కానున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆయా బ్యాంకులలో రూ.లక్షలోపు రుణాలు తీసుకొన్న 1,162 మంది చేనేత కార్మికులకు రూ.8 కోట్ల 4 లక్షలు రుణమాఫీ జరుగనుంది. అంతేకాక మరో 1,560 మంది లక్షకుపైగా రుణాలు తీసుకొన్నారు. వీరు రూ.లక్షపైన ఉన్న రుణ మొత్తాన్ని వెంటనే చెల్లిస్తే వారికి సైతం రూ.15.60 కోట్ల రుణమాఫీ వర్తించనుంది. యాదాద్రి జిల్లాలో మొత్తం 2,722 మందికి రూ.23.64 కోట్ల రుణవిముక్తి లభించనుంది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి 604 మంది కార్మికులకు రూ.3.04 కోట్ల రుణమాఫీ కానుంది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో 3,326 మందికి రూ.26.68 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది.
ఫ రుణమాఫీ పథకానికి
రూ.33 కోట్ల నిధులు మంజూరు
ఫ ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఫ చేనేత కార్మికుల్లో ఆనందం