
కల్వర్టు గోడను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
కట్టంగూర్: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ హైవేపై కల్వర్టు గోడను ఢీకొట్టడంతో 10మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామ శివారులో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేవీఆర్ ట్రావెల్స్ బస్సు సోమవారం అర్ధరాత్రి 30మంది ప్రయాణికులతో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరింది. మంగళవారం తెల్లవారుజామున మార్గమధ్యలో కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామ శివారులోకి రాగానే డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో బస్సు అదుపుతప్పి విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై గల కల్వర్టు గోడను ఢీకొట్టింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే బస్సులో నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నించగా డోర్ లాక్ కావడంతో బయటకు వెళ్లలేకపోయారు. సమాచారం తెలుసుకున్న కట్టంగూర్ 108 సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని బస్సు అత్యవసర డోర్‌ను ధ్వంసం చేసి ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సత్యవతి, లక్ష్మి, గణపతిరెడ్డితో పాటు మరో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనాల్లో నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. బస్సు ఓనర్ ఫిర్యాదు మేరకు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎం. రవీందర్ తెలిపారు.
ఫ 10 మంది ప్రయాణికులకు గాయాలు