
బండరాయి మీద పడి యువకుడి మృతి
మోత్కూరు: బండరాయి కొడుతుండగా.. ప్రమాదవశాత్తు మీద పడి యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని కాశవారిగూడేనికి చెందిన షేక్ నాగుల్‌మీరా (31), మరో ఆరుగురు కలిసి మంగళవారం బుజిలాపురం గ్రామ ప్రధాన రహదారి వెంట బీరప్ప గుడి వద్ద గల గుట్ట దగ్గర బండ కొట్టే పనికి వెళ్లారు. పెద్ద బండరాయిని కొడుతుండగా.. అందులో నుంచి ఒక బండ ఊడి షేక్ నాగుల్‌మీరా మీద పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడితో ఉన్న ఇమామ్ (మామ), షేక్ హోలి, షేక్ జాన్‌బాషా, షేక్ మౌలానా, షేక్ పక్కీర్‌లు బండ పైనుంచి పక్కకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. వారికి స్వల్ప గాయాలయ్యాయి. నాగుల్‌మీరాను వెంటనే అంబులెన్స్‌లో మోత్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య ఇమామ్‌బీ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఘటనా స్థలాన్ని మోత్కూరు ఇన్‌స్పెక్టర్ సి. వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ నర్సింహ పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బండరాయి మీద పడి యువకుడి మృతి