
లంచం డిమాండ్.. పంచాయతీ కార్యదర్శి అరెస్ట్
పెన్‌పహాడ్: బొగ్గు బట్టీ నిర్వహణకు అనుమతి ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. నల్లగొండ రేంజ్ ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ తెలిపిన వివరాల ప్రకారం.. పెన్‌పహాడ్ మండలం నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన వ్యక్తి బొగ్గు బట్టీ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి అనంతుల సతీష్‌కుమార్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో పంచాయతీ కార్యదర్శి రూ. 15వేలు లంచం డిమాండ్ చేశాడు. అంత డబ్బు ఇవ్వలేనని, బతుకుదెరువు కోసం బొగ్గు బట్టీ పెట్టుకుంటున్నానని చెప్పినప్పటికీ కార్యదర్శి అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో బాధితుడు రూ.8వేలు ఇస్తానని చెప్పి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తన దగ్గర ఉన్న ఆధారాలను బాధితుడు ఏసీబీ అధికారులకు ఇవ్వడంతో అధికారులు విచారణ జరిపి పంచాయతీ కార్యదర్శి లంచం అడిగినట్లు రుజువు కావడంతో గురువారం అరెస్ట్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ తెలిపారు.