
నిరంతర సాధనతోనే విజయాలు సాధ్యం
నల్లగొండ టూటౌన్: నిరంతర సాధనతోనే విజయాలు సాధ్యమని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో విద్యార్థులకు ఉచిత పోటీ పరీక్షల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్‌తో కలిసి ఆమె ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు అవాంతరాలను అధిగమిస్తూ విజయపథంలో ముందుకుసాగాలని సూచించారు. మానవీయ సమాజ నిర్మాణమే లక్ష్యంగా విద్యార్థులు నడుచుకోవాలన్నారు. ఈ సందర్భంగా యూపీఎస్సీ సాధనలో తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. అనంతరం ఉచిత పోటీ పరీక్షల శిక్షణకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ.. నైపుణ్యాభివృద్ధి, మెంటారింగ్ ద్వారా సివిల్స్‌పై అవగాహన పెంచేందుకు 12 అంశాల్లో విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నామన్నారు. ఈ శిక్షణ 3 సంవత్సరాల పాటు కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు, అధ్యాపకులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ప్రదీప్, భవానీ శంకర్, రిజిస్ట్రార్ అల్వాల రవి, సురేష్‌రెడ్డి, ప్రిన్సిపాల్ సీహెచ్. సుధారాణి, కె. అరుణప్రియ, ప్రేమ్‌సాగర్, డాక్టర్ మద్దిలేటి, లక్ష్మీప్రభ, అనితా కుమారి, ఇందిర, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఫ నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి