
ప్రియుడితో కలిసి భర్త హత్య
● ఇద్దరు నిందితుల రిమాండ్
● వివరాలు వెల్లడించిన రామన్నపేట సీఐ
వలిగొండ : ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం వలిగొండ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. భువనగిరి మండలంలోని సింగన్నగూడెం గ్రామానికి చెందిన సురేష్, మంగ భార్యాభర్తలు. గౌస్ నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ పల్లెర్ల స్వామితో మంగ వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడంతో భర్త తన భార్యను పలుమార్లు మందలించాడు. బుధవారం తెల్లవారుజామున పల్లెర్ల స్వామి వీరి ఇంటికి రావడంతో సురేష్, స్వామి ఇద్దరు కలియబడ్డారు. ఇద్దరి మధ్య జరిగిన తోపులాటలో సురేష్ మృతిచెందాడు. అతడి మృతదేహాన్ని స్వామి, మంగ కలిసి ఆటోలో భీమలింగం కత్వ సమీపంలోకి తీసుకవెళ్లి కాల్వలో పడేశారు. బుధవారం కాల్వలో మృతదేహం లభ్యం కావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భార్య అనుమానంగా మాట్లాడటంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు అంగీకరించింది. ఈమేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో రిమాండ్ చేసినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో స్థానిక ఎస్సై యుగందర్, ప్రొబెషనరీ ఎస్సై శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.