
నల్లగొండలో కార్డన్ సెర్చ్
నల్లగొండ: నల్లగొండ పట్టణంలో గురువారం అర్ధరాత్రి నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గురువారం రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం ఉదయం 7 గంటల వరకు పట్టణంలోని మాన్యంచెల్కలో సుమారు 500 ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు. 8 మంది సీఐలు, 24 మంది ఎస్‌ఐలు, 80 మంది కానిస్టేబుళ్లు మొత్తం 320 మందితో తనిఖీలు నిర్వహించారు. జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, బిహార్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చి వలస ఉంటున్న వారిని గుర్తించారు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరి వివరాలు సేకరించి వారి ఆధార్ కార్డులతో ఆన్‌లైన్‌లో విచారణ చేశారు. నలుగురు రౌడీ షీటర్లతోపాటు 30 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరందరికీ గంజాయి పరీక్షలు నిర్వహంచగా ఎనమిది మందికి పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా ధ్రువపత్రాలు లేని 165 వాహనాలను, నాలుగు ఆటోలను సీజ్ చేశారు. అక్రమంగా ఎయిర్‌లేన్ కలిగిన వ్యక్తితోపాటు గాంజా చాక్లెట్లను అదుపులోకి తీసుకున్నారు. వారికి కౌన్సిలింగ్ నిర్వహించి మరోసారి నాకాబందీలో దొరికితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.
అనుమానం వస్తే సమాచారం ఇవ్వాలి
కమ్యూనిటీ కాంటాక్టులో భాగంగా నల్లగొండ పట్టణంలో కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు ఎస్పీ శరత్ చంద్రపవార్ తెలిపారు. శుక్రవారం ఆయన స్థానికంగా మీడియాతో మాట్లాడారు. కాలనీల్లో, ఇంటి ప్రదేశాల్లో అనుమానిత వ్యక్తులు కనబడితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు. పట్టణాన్ని నేర రహితంగా తీర్చిదిద్దడంతోపాటు ప్రజలకు శాంతిభద్రతలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో గంజాయిని అరికట్టేందుకు మూడు దశల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎక్కడైనా గంజాయి తాగుతున్నట్లు, రవాణా చేస్తున్నట్లు తెలిస్తే డయల్ 100, పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, రాఘవరావు, ఆదిరెడ్డి, కొండల్ రెడ్డి, నాగరాజు, రాజశేఖర్, ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య, సీఐ కరుణాకర్, ఎస్‌ఐలు సైదాబాబు, వై.సైదులు, శంకర్, గోపాల్‌రావు, సందీప్ రెడ్డి, మానస పాల్గొన్నారు.
ధ్రువపత్రాలు లేని 165 ద్విచక్ర
వాహనాలు, నాలుగు ఆటోలు సీజ్

నల్లగొండలో కార్డన్ సెర్చ్