
వానాకాలం సాగుకు సిద్ధమవ్వండిలా..
పంట మార్పిడి తప్పనిసరి
ఒకే భూమిలో ఏటా ఒకే పంటను కాకుండా పంట మార్పిడి చేసుకోవాలి. రైతులు ఒకే రకమైన పంటను వరుసగా సాగు చేస్తూ దిగుబడులు రాక నష్టపోతున్నారు. ఒకే పంటను ఏళ్ల తరబడి పండించడం వల్ల చీడపీడలకు ఎప్పుడూ ఆహారం సమృద్ధిగా లభించి అవి వృద్ధి చెందుతాయి. పంట వేర్లు వ్యాపించిన మేర భూమి పొరలు నిస్సారమవుతాయి. పంట మార్పిడి నేలసారాన్ని కాపాడుకోవడంతోపాటు తేమను సమర్ధవంతంగా వినియోగించుకోవచ్చు. వివిధ రకాల వేరు వ్యవస్ధలు కలిగి భిన్నంగా పెరిగే పైర్లను పంట మార్పిడి కోసం ఎంపిక చేసుకోవాలి. పత్తి, ఆముదం, పొద్దు తిరుగుడు వంటి పైర్లు నేల లోపలి నుంచి పోషకాలు తీసుకుంటాయి. పోషకాలు ఎక్కువగా తీసుకునే నువ్వులు, పొద్దు తిరుగుడు వంటి పంటలకు భూమికి పోషకాలు సమకూర్చే అవసరాల పైర్లతో పంట మార్పిడి చేసుకోవాలి. ఇవి బెట్ట పరిస్థితులను తట్టుకుంటాయి. వరుసగా పప్పుధాన్యాల పంటలు కాకుండా నూనె పంటలు సాగు చేయాలి. టమాట, వేరుశనగ, పంటలను ఆశించే లద్దె పురుగు నివారణకు జొన్న, సజ్జ, రాగి ఎర పంటలుగా వేసుకోవాలి.
పెద్దవూర: వానాకాలం సీజన్ సమీపిస్తుండటంతో రైతులు వ్యవసాయ పనులకు సన్నద్ధమవుతున్నారు. వేసవి దుక్కులు, భూసార పరీక్షలు, నేల స్వభావాన్ని బట్టి పంటల సాగు ఇతర సాగు విధానాలపై రైతులు మెళకువలు, అవగాహన కలిగి ఉండాలని, వేసవి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పెద్దవూర మండల వ్యవసాయాధికారి సందీప్‌కుమార్ పేర్కొంటున్నారు.
లోతు దుక్కులతో మేలు
లోతు దుక్కులు దున్నినప్పుడు భూమిలో ఉండే పురుగులు, తెగుళ్లను నశింపజేసే అవకాశం ఉంటుంది. భూమిలో దాగి ఉన్న లేదా నిద్రావస్థలో ఉన్న పురుగులు, తెగుళ్లను కలుగజేసే శిలీంద్రాలకు సూర్యరశ్మి సోకి నశిస్తాయి. దుక్కిలో బయట పడిన గుడ్లు, ప్యూపాలను పక్షులు తిని నాశనం చేస్తాయి. అందుకే తొలకరిలో వేసే పైర్లకు వీటి తాకిడి తగ్గడానికి అవకాశం ఉంటుంది. భూమిలో 9 అంగుళాల వరకు లోతు తగ్గకుండా దుక్కులు దున్నుకోవడం శ్రేయస్కరం.
కలుపు నిర్మూలన
తుంగ, గరిక వంటి కలుపు మొక్కలు పొలాల్లో పెరిగి పంటలు నాశనం చేస్తాయి. దీనివల్ల భూసారం తగ్గడమేకాకుండా భూమిలోని లోతైన పొరల్లో తేమ తగ్గుతుంది. తుంగ, గరికల వేర్లు దుబ్బుగా ఉండి నేలలో బాగా విస్తరించి ఉండటం వల్ల నివారణ కష్టం అవుతుంది. వేసవిలో బాగా దుక్కి దున్నినప్పుడు ఈ కలుపు వేర్లు , దుంపలు ఏరడంతో వీటిని అరికట్టవచ్చు. వేసవిలో లోతుగా దున్ని తొలకరి వర్షాలకు గొర్రు, గుంటులతో దున్నినప్పుడు నేల బాగా గుల్ల బారుతుంది. పైర్ల వేర్లు బాగా విస్తరించడానికి అనుకూలంగా ఉంటుంది. నేలకోతకు గురికాకుండా వాలుకు అడ్డంగా దున్నడం, వర్షపు నీటికి ప్రవాహానికి అడ్డంగా చిన్నపాటి మట్టి, రాతి కట్టడాలు ఏర్పాటు చేసుకోవాలి. గత ఖరీఫ్‌కు సంబందించి పొలాల్లో ఉన్న ప్రత్తి, కంది, ఆముదం కట్టెలను తొలగించి పొలంలోనే కాల్చివేయాలి.
భూసార పరీక్షల ఆధారంగా పంటలు
రైతులు ముఖ్యంగా పండ్లతోటలు సాగు చేసే రైతులు భూసార పరీక్షలు చేయించి పంటలు సాగు చేసుకోవాలి. లేకపోతే ఐదేళ్ల వరకు పెంచి కాపు కొచ్చే దశలోనే క్షీణించి రైతుకు పెట్టుబడి నష్టపోయే ప్రమాదం ఉంది. భూసార పరీక్షలు ద్వారా తమ నేల ఏ పంటలకు అనూకూలమో నిర్ధారించుకోవాలి.

వానాకాలం సాగుకు సిద్ధమవ్వండిలా..