ఇంజనీరింగ్‌ కోర్సులు.. భవితకు బాటలు | - | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌ కోర్సులు.. భవితకు బాటలు

Jul 3 2025 7:43 AM | Updated on Jul 3 2025 4:45 PM

ఇంజనీ

ఇంజనీరింగ్‌ కోర్సులు.. భవితకు బాటలు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్మీడియెట్‌ తరువాత డిగ్రీ కోర్సుల వైపు వెళ్లడం గత రెండు దశాబ్దాల క్రితం ఉండేది. అప్పట్లో డిగ్రీలు, పీజీలు చేసిన వారికి మంచి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉండేవి. దానికి తోడు సివిల్స్‌, ఏపీపీఎస్సీ, బ్యాంకింగ్‌, రైల్వే ఉద్యోగాలకు క్రేజ్‌ ఉండేది. అనంతరం విద్యారంగంలో సమూల మార్పు వచ్చింది. సమాజంలో సాంకేతిక విప్లవం వేగంగా వ్యాప్తి చెందడంతో ఆ రంగంలో ఉపాధి అవకాశాలు అత్యధికంగా లభిస్తున్నాయి. దీనితో ఇంటర్మీడియెట్‌ తరువాత విద్యార్థుల తొలి ప్రాధాన్యత సాంకేతిక ఉన్నత విద్య ఇంజనీరింగ్‌ వైపే మొగ్గు చూపింది.

కృత్రిమ మేథ (ఏఐ) వైపు చూపు

రానున్నది కృత్రిమ మేథ శకమని నిపుణులు అంచనా వేస్తున్న తరుణంలో విద్యార్థులు అటువైపు ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తునట్టు తెలుస్తోంది. గత నాలుగేళ్లుగా ఏఐ బ్రాంచ్‌లు అందుబాటులో ఉన్న అన్ని కళాశాలల్లోనూ, సీఎస్‌ఈతో పాటు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లోని మెషీన్‌ లెర్నింగ్‌, డేటా సైన్స్‌ తదితర బ్రాంచ్‌లు సైతం పూర్తి సీట్లు భర్తీ కావడం చూస్తుంటే విద్యార్థులు ఏఐ వైపు ఎంత ఆసక్తిగా ఉన్నారో గ్రహించవచ్చు.

ఎవర్‌గ్రీన్‌గా మెకానికల్‌ బ్రాంచ్‌

ఏ కోర్సు తీసుకుంటే తేలికగా ఉత్తీర్ణులవడంతో పాటు చదువు పూర్తి కాగానే ఉద్యోగాలు లభిస్తాయా అనేది విద్యార్థులను వేధిస్తున్న ప్రధాన ప్రశ్న. ముఖ్యంగా మెకానికల్‌ ఇంజనీరింగ్‌కు ఎవర్‌ గ్రీన్‌ బ్రాంచ్‌గా గుర్తింపు ఉంది. ద్విచక్ర వాహనాల నుంచి విమానాల తయారీ వరకూ మెకానికల్‌ ఇంజనీర్ల ప్రాతే కీలకంగా ఉంటుంది. అలాగే కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, గణితం సమ్మిళితంగా ఉండే కెమికల్‌ ఇంజనీరింగ్‌కు సైతం మంచి భవిష్యత్‌ ఉందని తెలుస్తోంది. డీఎన్‌ఏ సీక్వెన్సింగ్‌, మానవ జీనోమ్‌ ప్రాజెక్టు, జెనెటిక్‌ ఇంజనీరింగ్‌ వంటివి కెమికల్‌ ఇంజనీరింగ్‌లో మార్పులకు తెరతీశాయి.

సీఎస్‌ఈకే తొలి ప్రాధాన్యత

ఈఏపీ సెట్‌లో మంచి ర్యాంకు సాధించిన విద్యార్థుల్లో ఎక్కువమంది సీఎస్‌ఈలో చేరడానికే ఆసక్తి చూపుతారు. ఈ బ్రాంచ్‌తో ఐటీ కొలువులు, ఆకర్షణీయ ప్యాకేజీలు లభిస్తాయనే నమ్మకమే కారణం. అందుకు తగ్గట్టుగానే క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లలో ఐటీ రంగ కంపెనీలు ముందుగా సీఎస్‌ఈ విద్యార్థులకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. నాలుగేళ్ల కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌లో ముఖ్యంగా కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌, నెట్‌ వర్కింగ్‌, అల్గారిథమ్స్‌, ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌, ప్రోగ్రామ్‌ డిజైన్‌, కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటా బేస్‌, డేటా స్ట్రక్చర్స్‌ తదితర అంశాలను అధ్యయనం చేస్తారు.

ఈసీఈతో రెండురకాల లాభం

ఇంజనీరింగ్‌ చదివే విద్యార్థులకు రెండో ప్రాధాన్యంగా ఈసీఈ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూ నికేషన్‌ ఇంజినీరింగ్‌) నిలుస్తోంది. ఈ బ్రాంచ్‌లో ప్రధానంగా ఎలక్ట్రికల్‌ పరికరాలు, అనలాగ్‌ ఇంటిగ్రేటేడ్‌ సర్క్యూట్స్‌, శాటిలైట్‌ కమ్యూనికేషన్‌, మైక్రోవేవ్‌ ఇంజినీరింగ్‌, మైక్రో ప్రాసెసర్స్‌, మైక్రో కంట్రోలర్స్‌, ట్రాన్స్‌మీటర్‌, రిసీవర్‌, ఎలక్ట్రానిక్‌, కమ్యూనికేషన్‌ పరికరాల తయారీ, యాంటెన్నా, కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌ గురించి అవగాహన కలిగిస్తారు. ఈ బ్రాంచ్‌లో చేరడం వల్ల కోర్‌ సెక్టార్‌తో పాటు సాఫ్టవేర్‌ రంగాల్లోనూ కొలువులు సొంతం చేసుకునే అవకాశం ఉంది.

ట్రిపుల్‌ ఈలో 2 లక్షల ఉద్యోగాలు రెడీ

ప్రైవేట్‌ రంగంలో ఏర్పాటవుతున్న హైడల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ కారణంగా రానున్న నాలుగేళ్లలో రెండు లక్షల మంది ఈఈఈ ఇంజినీర్ల కోసం ఉద్యోగాలు ఎదురు చూస్తాయని నిపుణుల అంచనా. ఈఈఈ ద్వారా అటు ఎలక్ట్రికల్‌, ఇటు ఎలక్ట్రానిక్స్‌ రెండింటిపైనా పట్టు లభిస్తుంది. ఫలితంగా రెండు రంగాలకు చెందిన పరిశ్రమల్లో ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. అందుకే ఇంజినీరింగ్‌ విద్యార్థుల భవిష్యత్తుకు ఈ కోర్సు భరోసాగా నిలుస్తోంది. ఎలక్ట్రికల్‌ టెక్నాలజీ, మెషీన్‌, మోటార్లు, జనరేటర్లు, సర్క్యూట్‌ అనాలసిస్‌, పవర్‌ ఇంజినీరింగ్‌ తదితర అంశాలను ఇందులో చదువుతారు.

జిల్లాలో 6 ఇంజనీరింగ్‌ కళాశాలలు

ఏలూరు జిల్లాలో మొత్తం 6 ఇంజనీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. ఏలూరులోని సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో 1,200 సీట్లు, రామచంద్ర కళాశాలలో 900, ఏలూరు ఇంజనీరింగ్‌ కళాశాలలో 600, హేలాపురి కళాశాలలో 360 సీట్లు, ఆగిరిపల్లిలోని ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో 1,360, నూజివీడులోని సారథి కళాశాలలో 420 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్ల కోసం జిల్లా విద్యార్థుల నుంచి పోటీ తక్కువగానే ఉంటుంది. కాకపోతే ఇతర జిల్లాల విద్యార్థులు కూడా ఇక్కడి కళాశాలల్లో చేరేందుకు ఉత్సాహం చూపడంతో సీట్లు లభించడం కష్టతరంగా మారింది. ఈ ఏడాది నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్‌ పరీక్షల్లో ఏలూరు జిల్లా నుంచి 4,700 మంది పరీక్ష రాయగా వారిలో ఇంజనీరింగ్‌ కోర్సుకు 3,409 మంది మాత్రమే అర్హత సాధించారు.

జిల్లాలో 6 కాలేజీలు.. 4,840 సీట్లు

కృత్రిమ మేథ (ఏఐ) వైపు అందరి చూపు

సీఎస్‌ఈకి తగ్గని క్రేజ్‌

బ్రాంచ్‌ ఏదైనా పట్టు సాధిస్తే విజయ తీరాలకు

సృజనాత్మకతతో అద్భుతాలు

పదును పెట్టి నూతన ఆవిష్కరణల దిశగా విద్యార్థులు అడుగులు వేయాల్సిన తరుణం ఆసన్నమైందని గుర్తించాలి. విద్యార్థులు తమ సృజనాత్మకతకు సానపెడితే అద్భుతాలు సాధ్యమౌతాయి. అటువంటి విద్యార్థులు వారి అబివృద్ధితో పాటు దేశాభివృద్ధిలో కూడా తమ భాగస్వామ్యాన్ని ఘనంగా చాటిచెప్పే అవకాశం ఉంటుంది.

–డాక్టర్‌ కే వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్‌, సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల, ఏలూరు

ఇంజనీరింగ్‌ కోర్సులు.. భవితకు బాటలు 1
1/1

ఇంజనీరింగ్‌ కోర్సులు.. భవితకు బాటలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement