
ఇదేం తీరువా బాబూ !
బాదుడే.. బాదుడు
గురువారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2025
నీటి తీరువా డివిజన్ల వారీగా
రెవెన్యూ రైతు నీటి తీరువా
డివిజన్ ఖాతాలు మొత్తం
భీమవరం 99,329 రూ. 11.83 కోట్లు
తాడేపల్లిగూడెం 90,475 రూ. 4 కోట్లు
నరసాపురం 1,41,365 రూ. 5.98 కోట్లు
సాక్షి, భీమవరం: సూపర్ సిక్స్‌లోని అన్నదాత సుఖీ భవ సాయం అందించకపోగా రైతులపై భారం మోపడమే పనిగా కూటమి పాలన సాగుతోంది. ఇప్పటికే గత ప్రభుత్వం తెచ్చిన ఉచిత పంటల బీమా పథకానికి ఎసరుపెట్టి ఏడాదికి దాదాపు రూ.28 కోట్ల ప్రీమియంను రైతులపై మోపింది. మరుగున పడిన నీటితీరువాను తాజాగా తెరపైకి తెచ్చి పన్నుల రూపంలో రూ.21.81 కోట్లు రైతుల నుంచి వసూలు చేసే పనిలో పడింది. తొలకరికి పెట్టుబడులకు సొమ్ముల్లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు వేలకు వేలు నీటి తీరువా చెల్లించాల్సి రావడం భారంగా మారింది. సాగునీటి సరఫరాకు గతంలో నీటి తీరువా పేరిట రెవెన్యూ శాఖ రైతుల నుంచి పన్ను వసూలు చేసేది. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది ఈ సొమ్ములు వసూలు చేసేవారు. ఈ విధానంలో అక్రమాలు జరుగుతున్నట్టు ఆరోపణలు ఉండటంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆన్‌లైన్ విధానం తీసుకురావాలని భావించినప్పటికీ రైతులకు ఊరటనిస్తూ ఆ ప్రక్రియను పక్కన పెట్టేసింది. వెబ్‌సైట్ సిద్ధం కాకపోవడంతో గత మూడేళ్లుగా నీటి తీరువా ఊసేలేకుండా పోయింది.
నీటి తీరువా భారం రూ.21.81 కోట్లు
అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా రూ.20 వేల సాయం అందిస్తామని చెప్పి గద్దెనెక్కిన కూటమి మొదటి ఇంతవరకూ చిల్లిగవ్వ ఇవ్వలేదు. తొలకరి పెట్టుబడుల కోసం సొమ్ముల్లేక రైతులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో వారి నుంచి నీటి తీరువా వసూళ్ల కోసం రెవెన్యూ శాఖకు ఆదేశాలిచ్చింది. ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తిచేయడం ద్వారా రెండు పంటలు పండే వ్యవసాయ భూములైతే ఎకరానికి మొదటి పంటకు రూ.200, రెండవ పంటకు రూ.150 వంతున మొత్తం రూ.350, ఆక్వా చెరువులకు ఏడాదికి ఒకే పంట లెక్కన ఎకరానికి రూ.500 వసూలుకు ఆదేశాలిచ్చింది. జిల్లాలోని 3,31,169 మంది రైతుల ఖాతాల నుంచి పాత బకాయిలు రూ.5.62 కోట్లకు వడ్డీ రూ.33.77 లక్షలు, ప్రస్తుత డిమాండ్ రూ.15.84 కోట్లు కలిపి రూ. 21.81 కోట్లు నీటితీరువా వసూలు చేయాల్సి ఉంది. ఈ మేరకు ఆర్డీఓలు, తహసీల్దార్లకు ఉత్తర్వులు రావడంతో పన్నుల వసూళ్లలో నిమగ్నమయ్యారు. మూడేళ్లకు పాత బకాయిలు, వడ్డీలతో కలిపి ఒక్కసారే రైతుల నుంచి వేలల్లో వసూలు చేస్తున్నారు. పంట పెట్టుబడులకు సొమ్ములు లేక ఇబ్బందులు పడుతుంటే మూడేళ్ల బకాయి ఒక్కసారే కట్టాలని రెవెన్యూ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఆలస్యం చేస్తే పెనాల్టీతో చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అయినకాడికి అప్పులు చేసి చెల్లిస్తున్నామంటున్నారు. నీటి తీరువా మొత్తం రూ.21.81 కోట్లకు గాను ఇంతవరకు రూ.8.36 కోట్లు వసూలైనట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.
సర్వీస్ ట్యాక్స్ అదనం
నీటి తీరువాతో పాటు రైతుల నుంచి సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తుండటం గమనార్హం. పన్ను చెల్లింపు కోసం చేసే ప్రతి ట్రాన్సాక్షన్‌్‌కు అదనంగా రూ.35 సర్వీసు టాక్స్ వసూలు చేస్తున్నారు. గతంలో ఎప్పుడు ఇలాంటి ట్యాక్స్‌లు చూడలేదని రైతులు వాపోతున్నారు.
న్యూస్‌రీల్
రైతులపై కక్ష కట్టిన కూటమి ప్రభుత్వం
ఇప్పటికే ఉచిత పంటల బీమాకు ఎసరు
తాజాగా నీటి తీరువా వసూలుకు ఆదేశం
రైతుల నుంచి రూ. 21.81 కోట్లు వసూలు చేసే పనిలో రెవెన్యూ యంత్రాంగం
నీటి తీరువా వసూలు చేయని గత వైఎస్సార్‌సీపీ సర్కారు
పంట చేతికొచ్చిన ఆనందం లేదు
గత ప్రభుత్వంలో నీటి తీరువా ఊసే ఉండేది కాదు. ఈ ప్రభుత్వం వచ్చాక పాత బకాయిలంటూ వడ్డీలు వేసి మరీ చెల్లించాలని రెవెన్యూ ఉద్యోగులు చెబుతున్నారు. మూడేళ్లకు కలిపి నీటితీరువా రూ. 21 వేలు చెల్లించాను. పంట డబ్బులు చేతికొచ్చాయన్న ఆనందం లేకుండా పన్నుకే సరిపోయింది.
– వెలగల వెంకటేశ్వరరెడ్డి, రైతు, పెనుమంట్ర
రైతులపై భారం మోపుతున్నారు
రైతులను ఆదుకోవాల్సింది పోయి ఏదో రూపంలో ఈ ప్రభుత్వం మాపై భారం మోపుతోంది. ఉచిత పంటల బీమాను రద్దుచేయడంతో ప్రీమియం రైతులే చెల్లించుకోవాల్సి వస్తోంది. కొన్నేళ్లుగా నీటి తీరువా ఊసులేకుండా ఉంది. ఇప్పుడు వడ్డీలు, జరిమానాలు అంటూ రైతులపై భారం మోపుతున్నారు.
– కందుల సత్యనారాయణ, రైతు, వీరవాసరం
జగన్ సర్కారు 2019 ఖరీఫ్ నుంచి ఉచిత పంటల బీమా పథకాన్ని తెచ్చిన విషయం విదితమే. ఈ క్రాప్ నమోదు ప్రామాణికంగా సాగు విస్తీర్ణం అంతటికి రైతులు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తూ వచ్చింది. కూటమి వచ్చాక ఈ పథకాన్ని ఎత్తివేయడంతో ప్రీమియం వాటాను రైతులే చెల్లించాల్సి వస్తోంది. ఎకరాకు పంట విలువ రూ. 41,000లో ప్రీమియంగా రెండు శాతం మొత్తం రూ. 820 బీమా కంపెనీకి చెల్లించాలి. దీనిలో ప్రభుత్వ వాటా 0.5 శాతం (రూ.205) కాగా, మిగిలిన 1.5 శాతం (రూ.615లు) రైతులే చెల్లించాలి. ఏడాదికి ప్రీమియం రూపంలో వరి రైతులపై రూ.28 కోట్ల భారం పడుతున్నట్టు అంచనా.

ఇదేం తీరువా బాబూ !

ఇదేం తీరువా బాబూ !

ఇదేం తీరువా బాబూ !