
కోకో రైతుల నిరసన
పెదవేగి: ఈ నెల 15 వరకు కిలో కోకో గింజలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.50 ప్రోత్సాహంతో రూ.500 ధర రైతులకు వచ్చేలా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో కొండలరావుపాలెంలో జరిగిన సమావేశంలో డిమాండ్ చేశారు. కొండరాలవు పాలెం,రైతు సేవా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పాలడుగు నరసింహారావు అధ్యక్షతన కోకో రైతుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల్లో అనేక చోట్ల కోకో రైతుల నుంచి సక్రమంగా దరఖాస్తులు తీసుకోకుండా ఇబ్బందులకు గురి చేయడం వల్ల ఇంకా గింజలు అమ్ముకోలేని పరిస్థితి ఉందన్నారు. కోకో రైతులు చేసిన పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ పథకం వర్తింపజేసి కిలో కోకో గింజలకు రూ.50 ప్రోత్సాహం ఇస్తుందని, కంపెనీలు ఇస్తున్న ధర కిలోకు రూ.450 కలిపి రూ.500గా నిర్ణయించి జూన్ 30 వరకు కొనుగోలు చేశారని, మిగిలిన గింజలు కొనుగోలు చేసేలా ఈనెల 15 వరకు రైతుల నుంచి కోకో గింజలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర వచ్చేలా ఫార్ములా రూపొందించాలని కోరారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం నాయకులు గుదిబండి వీరారెడ్డి,పాలడుగు నరసింహారావు, యరకరాజు శ్రీనివాసరాజు, కోనేరు సతీష్ బాబు, కరెడ్ల సత్యనారాయణ, బింగిన శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు